Gurugram man arrested for stealing flower pots kept for G20 Summit
mictv telugu

ఆ పూల మొక్కలను దొంగలించింది ఎవరో తెలిసింది

March 1, 2023

Gurugram man arrested for stealing flower pots kept for G20 Summit

కొంతమందికి ఎంత సంపద ఉన్నా సంతృప్తి ఉండదు. ఇంకా ఏదో కావాలని చిన్న చిన్న వాటికి కూడా కక్కుర్తి పడుతుంటారు. కొన్నిసార్లు మాటల ద్వారానో, మరికొన్ని సార్లు చేతల ద్వారానో తమ బుద్ధి ఏంటో చూపిస్తూనే ఉంటారు. కార్లు, బంగ్లాలు ఉన్నోళ్లంతా హుందాగా ఉంటారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. తాజాగా అలాంటి మరో ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇద్దరు ధనవంతులు పూలకుండీలు దొంగతనం చేస్తూ వీడియోకు అడ్డంగా దొరికిపోయారు. పూల కుండీలను తీసుకొని వారి లగ్జరీ కారు ట్రంక్‌లో పెట్టుకుంటున్న వీడియోలో వైరల్‌గా మారింది.

గుర్గావ్‌లో జరుగుతున్న జీ20 సదస్సులో అలంకరణ కోసం తీసుకొచ్చిన పూల కుండీలను దొంగిలిస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీఐపీ లైసెన్స్ ప్లేట్ ఉన్న అధునాతన వాహనంలో వచ్చిన వీరు పట్టపగలు చోరీకి పాల్పడ్డారు. పూలకుండీల్లో కొన్నింటిని రూ.40 లక్షల విలువైన ఖరీదైన కియా కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తుల గురించి గురుగ్రామ్ అధికారులు ఆరా తీశారు. పూలకుండీలు ఎత్తుకెళ్లిన వారిలో ఒకరు ఓల్డ్ గురుగ్రామ్‌లోని సెక్టార్-11లోని గాంధీ నగర్‌లో నివసిస్తున్న 55 ఏళ్ల మన్మోహన్ యాదవ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఆ కారు రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో నిందితుడిని గుర్తించినట్లు పోలీసు డిప్యూటీ కమిషనర్ (తూర్పు) వీరేందర్ విజ్ తెలిపారు.”పూల కుండీలతో పాటు దొంగిలించబడిన మొక్కలను తిరిగి తీసుకున్నాం. కియా కార్నివాల్ అనే కారును కూడా స్వాధీనం చేసుకున్నాం. ఆ కారు యాదవ్ భార్య పేరు మీద రిజిస్టర్ చేయబడి ఉంది ” అని ఆయన అన్నారు. మొక్కలను ఎందుకు దొంగిలించాడో తెలుసుకునేందుకు నిందితుడిని విచారిస్తామని తెలిపారు.

జీ20 సమ్మిట్ న్యూఢిల్లీలోని గురుగ్రామ్లో జరుగుతోంది. మార్చి 1 నుంచి 14 వరకు జరిగే జీ20 మీటింగ్లో వివిధ దేశాలకు చెందిన చాలా మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశం కోసం గురుగ్రామ్అధికారులు సమ్మిట్ జరిగే హోటల్స్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, రోడ్లను సుందరంగా అలంకరించారు. చాలా చోట్ల కుండీల్లో పూల మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే దొంగతనం జరిగింది.