Gurugram: Woman Stays In Confinement With Son For 3 Years To Beat Covid-19 Scare, Rescued
mictv telugu

కరోనా భయంతో మూడేళ్లుగా ‘లాక్‌డౌన్‌’లోనే తల్లీ కొడుకులు

February 23, 2023

 Gurugram: Woman Stays In Confinement With Son For 3 Years To Beat Covid-19 Scare, Rescued

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఓ మహిళ తన కొడుకుతో సహా మూడేళ్లుగా ఇంట్లోనే తలపులు వేసుకుని ఉండిపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. హరియాణా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే తల్లీకొడుకులు కోవిడ్ భయంతో మూడు సంవత్సరాలుగా బయటకు అడుగు పెట్టలేదు.ఈ మూడేళ్లూ బయటకు వెళ్లి పనిచేస్తున్న తన భర్తను సైతం ఆమె ఇంట్లోకి అడుగుపెట్టనివ్వలేదని అధికారులు చెప్తున్నారు.తాజాగా ఆమె భర్త పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎట్టకేలకు ఆ తల్లీకొడుకులను పోలీసులు, మహిళా శిశు సంక్షేమ అధికారులు రక్షించారు.

గురుగ్రామ్‌లోని మారుతీ విహార్‌కు చెందిన మున్‌మున్ మాఝీ అనే మహిళ.. తన భర్త, కొడుకుతో కలసి జీవించేది. కరోనా మహమ్మరి వచ్చినప్పటి నుంచి అంటే 2020 నుంచి తాను ఇంటినుంచి బయటకు రావట్లేదు. తన కుమారుడిని కూడా బయటకి వెళ్లనియ్యట్లేదు. నిర్బంధంలోనే ఉండిపోయారు. చివరికి ఆమె తన భర్త సుజన్ మాఝీను కూడా లోపలికి అనుమతించలేదు. ఆమె భర్త ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతను మొదట్లో స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో తలదాచుకున్నాడు. తర్వాత మరో ఇల్లును అద్దెకు తీసుకున్నాడు. తన భార్య, కొడుకుతో అప్పుడప్పుడు వీడియో కాల్ లో మాట్లాడేవాడు. నెలనెలా ఇంటి అద్దె చెల్లించి, కరెంటు బిల్లులు కట్టి, కిరాణా, కూరగాయలు కొనుక్కొని మెయిన్ డోర్ బయటే పెట్టేవాడు. ఇలా మూడేళ్లు గడిచిపోయింది.

కరోనా తగ్గుముఖం పట్టి, లాక్ డౌన్ ఎత్తేసి అంతా మాములు అయినప్పటికీ ఆమె మాత్రం తన కొడుకుతో కలిసి అలాగే నిర్బంధంలోనే ఉండిపోయింది. భర్త ఎంత నచ్చజెప్పినా వినలేదు. చివరికి ఆమె భర్త చక్కర్‌పూర్‌ పోలీసులను ఆశ్రయించడంతో వారు రంగంలోకి ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి వారిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. మున్‌మున్ కాస్త సైక్రియాట్రిక్‌ సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో చాలా చెత్త పేరుకుపోయిందని, ఇంకొన్ని రోజులు ఆగి ఉంటే అవాంఛనీయమైన ఘటన జరిగి ఉండేదని పోలీసులు చెప్పారు. ఇంట్లో గ్యాస్ స్టవ్ కు బదులు ఆమె ఇండక్షన్ స్టవ్ ద్వారా వంట చేసుకునేదని తెలిపారు.

ఆ మహిళ కుమారుడు గత మూడేళ్లుగా సూర్యుడిని కూడా చూడలేదు. కరోనా భయంతో ఈ మూడేళ్లలో వంటగ్యాస్, ట్యాంక్ నీరును వాడలేదు. ఇద్దరికీ చికిత్స అందిస్తున్నామని, త్వరలోనే వాళ్లు మళ్లీ నార్మల్ అవుతారని వైద్యులు చెబుతున్నారు. గురుగ్రామ్ సివిల్ సర్జన్ డాక్టర్ వీరేంద్ర యాదవ్ మాట్లాడుతూ… ‘మహిళకు కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి. వీరిద్దరినీ రోహ్ తక్ లోని పీజీఐకి తరలించి చికిత్స నిమిత్తం సైకియాట్రిక్ వార్డులో చేర్పించారని తెలిపారు. తన భార్య, కొడుకును రక్షించినందుకు ఆమె భర్త సుజన్‌ పోలీసులకు ధన్యవాదాలు చెప్పాడు.