Gurukulam school students stage protest against principal, watchman in Sircilla
mictv telugu

విద్యార్థినుల ఆందోళన ఎఫెక్ట్.. ఆ ఇద్దరూ సస్పెండ్

January 9, 2023

 Gurukulam school students stage protest against principal, watchman in Sircilla

గురుకులంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్స్కూల్ (గర్ల్స్) స్టూడెంట్లు ఆదివారం ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కరీంనగర్‌ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డీఎస్‌ వెంకన్న స్పందించారు. పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి లక్ష్మిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు.

ఆదివారం తెల్లవారుజామున 5.30 నుంచి 6 గంటల మధ్య దుమాల గురుకులం నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న మండల కేంద్రానికి కాలినడకన వచ్చి తొమ్మిదో తరగతి విద్యార్థినులు కామారెడ్డి- కరీంనగర్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అన్నం, పప్పుచారులో పురుగులు వస్తున్నాయని వార్డెన్‌ రమ్య, వంట మనిషి భద్రమ్మల దృష్టికి తీసుకెళ్తే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాచ్‌మెన్‌ రామస్వామి రాత్రిపూట మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. ప్రిన్సిపల్‌ జ్యోతిలక్ష్మికి చెబితే స్పందించలేదన్నారు. ఇవన్నీ తట్టుకోలేకే నిరసనకు దిగామని రోడ్లపై బైఠాయించారు.

వీరి నిరసనపై స్పందించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌తో మాట్లాడి విచారణకు ఆదేశించారు. రొనాల్డ్ రాస్ సూచన మేరకు రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డీఎస్ వెంకన్న ప్రిన్సిపల్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. విధుల నుంచి వాచ్‌మెన్‌ను తొలగించారు.