గురుకులాల గాలిలో ఆ కాలేజీలు కొట్టుకుపోయాయ్..! - MicTv.in - Telugu News
mictv telugu

గురుకులాల గాలిలో ఆ కాలేజీలు కొట్టుకుపోయాయ్..!

July 4, 2017

లక్షలకు లక్షలు ఖర్చు పెట్టలేదు.లాంగ్ టర్మ్ కోచింగ్ లు లేవు. లెక్చరర్లు రాచి రంపాన పెట్టలేదు.అయినా నీట్ లో గురుకుల విద్యార్థులు మెరిశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలో సత్తా చాటారు 84 మంది విద్యార్థులు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. మెడిసిన్ లో సీటు రావాలంటే శ్రీ చైతన్య, నారాయణలోనే చదవాల్సిన అవసరం లేదని ఫ్రూవ్ చేశారు. పైసా ఖర్చు లేకుండా డాక్టర్ కోర్సు చదవబోతున్నారు. ఇప్పుడున్న కొన్ని గురుకులాలకే శ్రీచైతన్య, నారాయణలు కొట్టుకుపోయాయ్.ముందు ముందు అన్ని గురుకులాలు మొదలైతే వాటి పరిస్థితి ఏంటీ..? అప్పటికైనా ఫీజులు తగ్గించి దారికొస్తాయా…ఈగలు కొట్టుకుంటాయా..?

గురుకులాలు ది గ్రేట్.అవును ఈ ఫలితాలు చూస్తే అనాల్సిందే..కార్పొరేట్ కాలేజీల దిమ్మతిరగాల్సిందే. వందలోపు ఒకటి ఒకటి.. రెండు రెండు.. నాలుగు నాలుగు అని మొత్తుకునే శ్రీ చైతన్య, నారాయణల మైండ్ బ్లాక్ కావాల్సిందే. గురుకులాల్లో చదివిన 84 మంది విద్యార్థులు నీట్ లో దుమ్మురేపారు. కులిపని చేసే కుటుంబం నుంచి వచ్చిన రాకేష్ రాష్ట్రస్థాయిలో 648 వ ర్యాంక్ సాధించాడు. కూరగాయలు అమ్మి నెట్టుకొస్తున్న కుటుంబానికి చెందిన ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి రమాదేవి 3213 ర్యాంకు సాధించింది. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఇది మామూలు విక్టరీ కాదు. ఏ కార్పొరేట్ కాలేజ్ కూడా సాధించలేదేమో.వాళ్లు చిన్నప్పటి నుంచి మెరికలు కారు. ఆ గురుకులాలకు చేరిన తర్వాతే తీర్చిదిద్దిన వాళ్లు. మెరిట్ బ్యాక్ డ్రాప్ లేకున్నా…నేషనల్ లెవల్లో మెరిసిపోయారు.

సూపర్ ర్యాంక్స్ కొట్టేసిన వీళ్లని కార్పొరేట్ కాలేజీల్లా రాచి రంపాన పెట్టలేదు గురుకులాలు. ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను ఇంటర్ మొదటి సంవత్సరంనుంచే రెడీ చేశాయి. రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాయి. కార్పొరేట్ లాగా ఓన్లీ క్లాసెస్ తోనే సరిపెట్టలేదు. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారయ్యేందుకు క్రీడలు, మెడిటేషన్, యోగా చేయించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని పుస్తకాలు లైబ్రరీల్లో ఉంచారు. ప్రతి ఆదివారం నీట్, ఎంసెట్ మోడల్ టెస్టుల నిర్వహణతో అధిక సంఖ్యలో స్టూడెంట్స్ ర్యాంకులు సాధించారు.

ఈ గ్రాండ్ విక్టరీలకు ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ యే కారణం. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులు ఎంసెట్, మెడిసిన్, ఐఐటీవంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ పేరిట ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిభ కనబరచి, డాక్టర్లు కావాలనుకునే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం 2015 జూన్‌నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ శిక్షణ ప్రారంభమయిన నాటి నుంచి ఇప్పటి వరకు 140 మంది విద్యార్థులు వైద్య విద్యాకోర్సులకు సెలక్టయ్యారు. కేవలం నీట్ ర్యాంకులే కాకుండా, దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో తెలంగాణ గురుకుల విద్యా సంస్థ విద్యార్థులు ప్రవేశార్హత సాధిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గురుకులాల విద్యాలయాల్లో వినూత్నమైన మార్పులు వచ్చాయి. నాణ్యమైన విద్య అందించడం, ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేక శిక్షణలు ఇస్తుండటంతో జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో సత్తాచాటుతున్నారు.ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన సీఎం కేసీఆర్.. ఈ ఏడాది సాధించిన విజయాలు మరిన్ని గురుకులాలు స్థాపించేందుకు ప్రేరణ ఇస్తున్నాయన్నారు. అవును ఇలాంటి ఫలితాలు వస్తేనే మరింత విద్యార్థుల్ని ఈ కాలేజీలకు రప్పించవచ్చు. తల్లిదండ్రుల్లో భరోసా నింపవచ్చు. గురుకులాలు ఇంత పేరు సంపాదించడానికి ఒకే ఒక్కడి కృషే కారణం. ఆ ఒక్కడి పట్టుదలే ఇలాంటి ఫలితాలకు దారి చూపిస్తోంది. ఆ ఒక్కడు ఎవరంటే గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌.ఎస్.. ప్రవీణ్ ప్రత్యేక నజర్ వల్లే ఇది సాధ్యమవుతుంది. ముందు ముందు గురుకులాలు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం.గురుకులాల గాలిలో కార్పొరేట్ కాలేజీలు కొట్టుకోవడం పక్కా..కిపిటప్ ప్రవీణ్ కుమార్…సలాం గురుకులాలు….

 

 

 

 

 

Gurukulas