Gutha Sukender Reddy sensational comments on the Governor
mictv telugu

గవర్నర్‌పై గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

September 15, 2022

కొంత మంది విలీనం, విమోచనం అంటూ ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడుకుంటున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో కలిసి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శాసనమండలి ఛైర్మన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఆనాడు పోరాటంలో అసువులు బారిన వారికి ఆయన జోహార్లు తెలిపారు. నల్గొండ పట్టణంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యత లేకుండా కొంత మంది విలీనం, విమోచనం అంటూ ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమన్నారు.

తెలంగాణ ఉద్యమం అంటే ఏంటో తెలియని వారు కూడా ఏదేదో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర గవర్నర్ సైతం విమోచన దినం అని వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. ఆమె పని చేసిన తన పూర్వ పార్టీ భావజాలాన్నే అనుసరిస్తూన్నారని ఆరోపించారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో సభ నిర్వహించడం సరికాదని చెప్పడానికి కేంద్రానికి, బీజేపీ వాళ్లకు ఏమి అవసరం అని ప్రశ్నించారు. కేంద్రం ఫెడరల్ వ్యవస్థకి విఘాతం కలిగిస్తున్నదని సుఖేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తూ.. రాష్ట్రాలను ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు.