గీతం యూనివర్సిటీ కట్టడాలను కూల్చిన జీవీఎంసీ  - MicTv.in - Telugu News
mictv telugu

గీతం యూనివర్సిటీ కట్టడాలను కూల్చిన జీవీఎంసీ 

October 24, 2020

University

విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో జీవీఎంసీ అధికారులు భవనాల కూల్చివేతను ప్రారంభించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించారంటూ వర్సిటీ ప్రధాన ద్వారం, ప్రహరీ గోడ కొంతభాగం, సెక్యూరిటీ గదులను కూల్చివేశారు. ఉదయాన్నే జేసీబీ, బుల్డోజర్లతో వచ్చిన సిబ్బంది చర్యలు చేపట్టారు. దీంతో అక్కడ పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కూల్చివేత నేపథ్యంలో బీచ్‌ రోడ్డు మీదుగా గీతం విశ్వవిద్యాలయానికి వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. 

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టడంపై గీతం యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎందుకు కూల్చుతున్నారో కూడా చెప్పడం లేదని ఆరోపించింది. ముందస్తు సమాచారం లేకుండా చేయడం దురదృష్టకరమని వర్సిటీ సిబ్బంది వ్యాఖ్యానించారు. న్యాయపరమైన అంశాలన్నీ కోర్టు పరిధిలో ఉండగా కూల్చివేతలు ఏంటని ప్రశ్నించారు. కాగా,గీతం వర్సిటీకి చెందిన 40 ఎకరాల భూమి ఆక్రమణలో ఉందని ఆర్డీవో పెంచల కిశోర్‌ అన్నారు. మరో దశలో మిగితా భవనాలను కూడా కూల్చుతామని చెప్పారు. విశాఖలో గత ఐదు నెలలుగా సర్వే, కూల్చివేతలు చేపట్టామని జీవీఎంసీ అధికారులు పేర్కొన్నారు.