ఫిట్‌గా ఉన్నారో లేరోనని ఫింగర్ టెస్ట్.. సూరత్‌లోనే - MicTv.in - Telugu News
mictv telugu

 ఫిట్‌గా ఉన్నారో లేరోనని ఫింగర్ టెస్ట్.. సూరత్‌లోనే

February 21, 2020

Gynaecological Finger Test in Surat Municipal Employees

ఇటీవల సూరత్‌లో కాలేజీ  విద్యార్థినులను బాత్రూమ్‌కు తీసుకెళ్లి రుతుక్రమ నిర్ధారణ చేసిన ఘటన మరవక ముందే మరో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న మహిళలపై అత్యంత దారుణంగా ప్రవర్తించారు. మెడికల్ టెస్టుల పేరిట వందమంది మహిళా ఉద్యోగినులను ప్రభుత్వ ఆసుపత్రిలో నగ్నంగా నిలబెట్టి లేడీ గైనకాలజి డాక్టర్ జననేంద్రియాలను పరీక్షించారు. వేలుపెట్టి పరీక్షిస్తూ అసభ్యకరమైన ప్రశ్నలు అడిగినట్టుగా ఉద్యోగినులు వాపోయారు. ఈ ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. 

మున్సిపాల్టీలో మూడేళ్లుగా ట్రెయినీ క్లర్కులుగా పనిచేస్తున్న వందమంది మహిళా ఉద్యోగినులను పర్మినెంట్ చేసేందుకు నిర్ణయించారు. దీంతో వారికి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ సమయంలో జననేంద్రియాల్లో ఫింగర్ టెస్ట్ పరీక్షలు కూడా చేశారు. ఒకేసారి పది మంది మహిళలను నగ్నంగా నిలబెట్టి తలుపులు కూడా సరిగా వేయకుండా పరీక్షలు జరిపారు. పెళ్లి కాని మహిళా ఉద్యోగినులపై సైతం లేడీ డాక్టర్లు అత్యంత దురుసుగా ప్రవర్తిస్తూ వారికి కూడా గర్భధారణ పరీక్షలు చేశారని ఉద్యోగులు ఆరోపించారు.

బలవంతంగా ఇలాంటి పరీక్షలు చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఫింగర్ టెస్ట్ లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఏఏ షేక్ డిమాండ్ చేశారు. అవివాహిత మహిళా ఉద్యోగినును సైతం గర్భం దాల్చారా అంటూ ప్రశ్నించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను  గైనకాలజీ విభాగం డాక్టర్ అశ్వనీ మాత్రం సమర్థించుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఇలా చేయాల్సిందేనంటూ బుకాయిస్తున్నారు. దీంతో ఈ అంశం ఇప్పుడు వివాదస్పదంగా మారింది.