ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను హ్యాకర్లు షేక్ చేశారు. భారత్ సహా 74 దేశాల్లో ఒకేరోజు వివిధ వ్యవస్థలపై 45వేల దాడులు చేశారు. ఈ విషయాన్ని రష్యా రాజధాని మాస్కోలోని సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కీ ల్యాబ్ వెల్లడించింది. కంప్యూటర్లను అన్‌లాక్ చేయాలంటే 300 డాలర్లు చెల్లించాలనే సందేశం కనిపిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. మరోవైపు ఈ దాడిని అడ్డుకునేందుకు సైబర్ పరిశోధకులు ‘కిల్ స్విచ్’ను కనుగొన్నారు.
దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థపై భారీ సైబర్ దాడి జరిగింది. ఏపీలోని దాదాపు 25శాతం పోలీసు స్టేషన్లలో కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. నిపుణులు వీటిని డీకోడింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తన కంప్యూటర్లో ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నందున హ్యాకింగ్‌కు గురికాలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఎక్కువ శాతం విండోస్‌కు వాడుతున్న కంప్యూటర్లే హ్యాకింగ్ అయ్యాయని అన్నారు. హ్యాకర్లు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలే కాదు …సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోన్న నాయకులను గడగడలాడిస్తున్నారు. ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు అస్త్రంగా చేసుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పార్టీల అధికారిక వెబ్సైట్లు.. సోషల్ మీడియా ఖాతాల్లోకి హ్యాకర్లు చొరబడుతున్నారు. వారి అంతర్గత వ్యవహారాలను బహిర్గతం చేస్తూ.. వ్యూహాలను దెబ్బతీస్తున్నారు.
ఈ కనిపించని ప్రత్యర్థుల బెడద రాజకీయ నాయకులకు ఇప్పుడు పెను సవాల్‌గా పరిణమిస్తోంది. బహిరంగంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించడంతో పాటు.. ఆన్లైన్ భద్రత కూడా నేతల్ని టెన్షన్ పెడుతోంది. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా హ్యాకర్లు విజృంభించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన జీమెయిల్ ఖాతా హ్యాక్ చేశారు. అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్‌తో పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్ వ్యూహాలను దెబ్బతీశారు. ఈ దాడిలో దాదాపు 60వేల ఈ మెయిళ్లను వికీలీక్స్ వెబ్సైట్లో బహిర్గతం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
‘నా ఈమెయిళ్లు హ్యాక్ చేసి ప్రత్యర్థులు మా వ్యూహాలను దెబ్బతీశారు. హ్యాకింగ్‌కు ముందు ఎన్నికలు జరిగి ఉంటే నేనే అమెరికాకు అధ్యక్షురాలిని అయ్యేదాన్ని’ అని హిల్లరీ వ్యాఖ్యానించారు. ఈ దాడి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలతోనే జరిగిందంటూ పెనుదుమారమే రేగింది. తాజాగా జరిగిన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ హ్యాకింగ్ దాడి సంచలనం సృష్టించింది. పోలింగ్‌కి 36గంటల ముందు తమ ఈమెయిళ్లతోపాటు.. 9జీబీల డాక్యుమెంట్లను హ్యాకర్లు చోరీ చేసి ఆన్లైన్లో పెట్టారంటూ ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి పోటీపడిన స్వతంత్ర అభ్యర్థి(అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు) ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆరోపించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత చర్యేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ ఈ హ్యాకింగ్ వ్యవహారం సంచలనంగా మారింది.
ఇక మన దేశంలోని రాజకీయ నాయకులకూ హ్యాకర్ల బెడద తప్పడంలేదు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతా గతేడాది నవంబర్‌లో హ్యాక్ అయింది. ఆయన అధికారిక ఖాతాతో కాంగ్రెస్ పార్టీకి.. గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన ట్వీట్లు చేసి అందరినీ షాక్‌కు గురిచేశారు హ్యాకర్లు. ఆ మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతానూ హ్యాక్ చేశారు. అలాగే తమ ట్విటర్ ఖాతాలు కూడా హ్యాకయంటూ ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్.. ఢిల్లీ మంత్రులు పలుమార్లు ఆరోపణలు చేశారు. జూన్ 8న ఎన్నికలకు వెళ్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే ప్రకటించడంతో అక్కడి ఆన్లైన్ భద్రతా విభాగం అలర్ట్ అయింది.
హ్యాకింగ్ దాడులు రీపిట్ కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు బ్రిటన్‌లోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది. చాలామంది రాజకీయ నాయకులు సైబర్ భద్రత గురించి పెద్దగా పట్టించుకోరన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. నిజమే. చాలామంది పెద్ద నాయకులు వారి సోషల్‌మీడియా ఖాతాలను అసిస్టెంట్లు.. దగ్గరి వాళ్లే చూస్తుంటారు. కానీ.. జాగ్రత్తలు పెద్దగా తీసుకోరు. ఇతర కార్పొరేట్ వెబ్సైట్ల మాదిరిగా.. రాజకీయ పార్టీల వెబ్సైట్లలో భద్రత ఉండదు. దీంతో చేయితిరిగిన హ్యాకర్లు సులువుగా తమ పని కానిచ్చేస్తున్నారని నిపుణులు చెబుతున్న మాట.