Haleem is the king of Indian cuisine
mictv telugu

భారతీయ వంటకాల రారాజు హలీమ్

November 25, 2022

హలీమ్ ఈ పేరు వింటేనే మనకు నోట్లో నీళ్ళూరిపోతాయి. నాన్ వెజ్ ప్రియులందరూ దాదాపు అత్యంత ఇష్టంగా తినే వంటకం ఇది. మన హైదరాబాదీ స్పెషల్ అయిన హలీంకి ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు ఉంది. 2010లో దీనికి జీఇ ట్యాగ్ ను కూడా ఇచ్చారు. ఇప్పుడు దానికి మరో కీర్తి కిరీటం తగిలించారు. వావ్ అనుకుంటున్నారా…అదేంటో తెలుసుకోవలని కుతూహలంగా ఉందా. అయితే ఈ స్టోరీ వినేయండి.

రంజాన్‌ స్పెషల్‌ హలీమ్‌.. ఒక్కసారి హైదరాబాద్‌ హలీమ్‌ తిన్నారంటే ఎవ్వరైనా గులామ్‌ కావాల్సిందే..! అంతలా ఉంటుంది అందులో మజా.. ఒకప్పుడు ముస్లింలుమాత్రమే తినే ఈ హలీం ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. రంజాన్‌ సీజన్ వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ నగరంలో ఎక్కడ చూసిన హలీమ్‌ బట్టీలు వెలిసేవి. కానీ కరోనా వల్ల ప్రస్తుతం అక్కడక్కడ మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. నిజాం కాలంలో ప్రారంభమైన హలీం సంప్రదాయం ఇప్పటికి కొనసాగుతోంది.

ముస్లింల పవిత్రమైన రంజాన్‌ మాసం వస్తే చాలు ప్రత్యేకంగా తయారు చేసే హలీమ్‌కు మంచి గిరాకీ ఉంటుంది. రంజాన్‌ మాసంలో విశిష్టమైన ఆహారంగా హలీమ్‌ నిలుస్తుంది. హైదరాబాద్‌ హలీమ్‌ అంటే పడిచచ్చేవాళ్లు మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఉన్నారు. రంజాన్‌ మాసంలో ప్రతీ వీధికో హాలీమ్ దుకాణం దర్శమనిచ్చేది. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా చార్మినార్, ఓల్డ్ సిటీ, మలక్ పేట, కుల్సుమ్ పుర, బహదూర్ పుర ఇలా అనేక ప్రాంతాల్లో హాలీమ్ అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తారు.

హలీం వంటకం పురుడు పోసుకుంది హైదరాబాద్‌లోనే. ఈ రుచికరమైన వంటకాన్ని మనమే ప్రపంచానికి పరిచయం చేశాం. ఇరాన్‌కు చెందిన హుస్సేన్‌ జాబిత్‌ 1947లో మదీనా సర్కిల్‌లో ఓ హోటల్‌ నెలకొల్పాడు. విభిన్న రకాల ఇరాన్‌ వంటకాలను నగరవాసులకు రుచి చూపించాడు. అయితే 1956లో రంజాన్‌ మాసం ప్రారంభమైన తొలిరోజు ‘హలీం’ పేరుతో ఓ కొత్త వంటకాన్ని తయారు చేసి, 25పైసలకు ఇవ్వడం ప్రారంభించాడు. అలా హలీం ప్రస్థానం ప్రారంభమైంది. ముందు అంతగా దీన్ని ఎవ్వరూ తినడానికి ఇష్టపడలేదంట కానీ 1961 తర్వాత మాత్రం విపరీతంగా పాపులర్ అయిపోయింది ఇది.

హలీం మన దేశం నుంచి విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. అందుకే హలీంకు 2010లో కీర్తి కిరీటం తగిలించారు. హలీం ను విశిష్ట వంటకంగా గుర్తిస్తూ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ను అందించారు. అయితే తాజాగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ భారతీయులు, విదేశీయులతో ఒక సర్వే నిర్వహించింది. జీఐ ట్యాగ్ పొందిన దేశీయ వంటకాల్లో రారాజు ఏదని సర్వేలో అడగ్గా ఎక్కువ ఓట్లు హలీం కే వచ్చాయి అంట. రసగుల్లా, భుజియా, రాట్లమీ సేవ్ లాంటి వంటకాలన్నింటినీ తోసిరాజనేసి మరీ హలీం కీర్తి కిరీటాన్ని నెత్తినపెట్టుకుంది.

ఆగస్టు2 నుంచి అక్టోబర్ 9 మధ్యన ఈ సర్వే నిర్వహించారు. హలీం కు ఫస్ట్ రావడంతో దానికో అవార్డును కూడా ఇచ్చింది కేంద్రప్రభుత్వం. ఆ అవార్డును పిస్తా హౌజ్ డైరెక్టర్ అయిన ఎంఏ మాజిద్ కు కేంద్రమంత్రి పియూష్ గోయల్ బహూకరించారుట కూడా.