ట్రాఫిక్‌ ఎస్సై టార్చర్‌.. చలాన్లు కట్టలేక హమాలీ ఆత్మహత్య - Telugu News - Mic tv
mictv telugu

ట్రాఫిక్‌ ఎస్సై టార్చర్‌.. చలాన్లు కట్టలేక హమాలీ ఆత్మహత్య

March 8, 2023

 


రోడ్డు ప్రమాదాలు నివారించడానికని, ట్రాఫిక్ నియంత్రణ కోసమని పోలీసులు, అధికారులు ఎన్నో రకాల కొత్త రూల్స్ తెచ్చి పెడుతున్నారు. హెల్మెట్ లేదని, ట్రిపుల్ రైడింగ్ అని, స్పీడ్ లిమిట్ పాటించలేదని, డ్రంక్ అండ్ డ్రైవ్ అని… మొత్తానికి ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని చలాన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల విషయంలో పగపట్టినట్లు సిగ్నల్స్ వద్ద ఎక్కడెకక్కడ కెమెరాలతో ఫోటోలు తీస్తూ చలాన్ల రూపంలో ఇంటికి పోస్టులు పంపుతున్నారు. ఈ చలాన్లు కట్టలేక సామాన్యుడు సతమతమవుతున్నాడు. సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యేనే ట్రాఫిక్ పోలీసులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అసెంబ్లీ వేదికగా చెప్పారంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

దొంగచాటుగా దాక్కుని ఫోటోలు తీసి చలాన్లు పంపుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ గత అసెంబ్లీ సమావేశాల్లో కీలక కామెంట్స్ చేశారు. ట్రాఫిక్ పోలీసుల కారణంగా, భారీ చలాన్లతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని , చలాన్లను కట్టడానికి అవస్థలు పడుతున్నారన్నారు. హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని కోరుతూనే.. చిన్న చిన్న తప్పులను మన్నించాలని కోరారు. అయినా కూడా ప్రభుత్వం ఏ మాత్రం కనికరించలేదు. తాజాగా ఓ వ్యక్తి ట్రాఫిక్‌ పోలీసులు వేసిన చలాన్లు కట్టలేక, వారి పెట్టే టార్చర్ తట్టుకోలేక, ఉన్న బైక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో మనస్తాపానికి గురైన అత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని చింతల్ బస్తిలో ఈ ఘటన జరిగింది.

Hamali commits suicide in hyderabad after not being able to pay Traffic challans

నల్లగొండ జిల్లా నేరడిగొమ్ము గ్రామానికి అన్నెపాక ఎల్లయ్య (52) బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి చింతల్‌ బస్తీలో నివాసం ఉంటున్నారు. హమాలీగా పనిచేస్తున్న ఎల్లయ్య ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని, చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని మీర్‌చౌక్‌ ట్రాఫిక్‌ పోలీసులు బైక్ ను సీజ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య సోమవారం రాత్రి ఇంటికి వచ్చి విషం తాగి అత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే డీఆర్‌డీఓ ఒవైసీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చలాన్ల సొమ్ము రూ.10 వేలు కడితేనే బండి ఇస్తానని ట్రాఫిక్‌ ఎస్సై చెప్పాడని, కూలీ పనులు చేసుకునే తనకు అంత సొమ్ము చెల్లించలేనని ఎంత బతిమాలినా వినలేదని, పైగా టార్చర్‌ పెట్టాడని సూసైడ్‌ నోట్‌లో రాశాడు. విచ్చలవిడిగా వేస్తున్న చలాన్లతో పేదలు నానా అవస్థలు పడుతున్నారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌, కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశాడు. కూలీ పనులు చేసుకుని బతుకుతున్న తాము అప్పు చేసి బైక్‌ కొన్నామని, రూ.10 వేలు చలాన్లు రాస్తే ఎలా చెల్లించగలమని, దయతో అలోచించాలని ముఖ్యమంత్రిని , మంత్రి కేటీఆర్ ను కోరాడు.

సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ముందు ఘటన వివరాలను గోప్యంగా ఉంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మొదట కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపిన పోలీసులు, సూసైడ్‌ నోట్‌ వెలుగులోకి రావడంతో కేసును మార్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం ఎల్లయ్య మృతదేహాన్ని భారీ బందోబస్తు మధ్య అతని స్వగ్రామానికి తరలించారు. ట్రాఫిక్‌ ఎస్సై గణేశ్‌ను సస్పెండ్‌ చేయాలని బీఎస్పీ హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ అలుగోలు రమేష్‌ డిమాండ్‌ చేశారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని సైదాబాద్‌ పీఎ్‌సలో ఫిర్యాదు చేశారు.