హమాలీ పోస్టుకు రూ. 60 లక్షలు.. - MicTv.in - Telugu News
mictv telugu

హమాలీ పోస్టుకు రూ. 60 లక్షలు..

October 20, 2022

విస్తుపోవాల్సిన వార్తే. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల జీతానికి మించిన జీతం. ఒంట్లో శక్తి ఉంటే చాలు, ఎంత కష్టపడితే అంత ఆదాయం. పేరుకు హమాలీ పనే అయినా దేనికీ కొరత లేని భద్రమైన కొలువు. అందుకే జనం ఎగబడ్డారు. మూటలు మోసుకెళ్లే హమాలీ పోస్టుకు అక్షరాలా రూ. 60 లక్షల 10 వేల ధర పలికింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్‌లోని ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ డిపోలో ఈ తతంగం చోటుచేసుకుంది. జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలకు ఇక్కడి నుంచే మద్యం సరఫరా అవుతుంటుంది. ఇక్కడ పనిచేసే హమాలీలకు చేతినిండా పనే. రోజుకు దాదాపు రూ. 3 వేల ఆదాయం ఉంటుంది.

ఒకసారి ఈ కొలువులో చేరితే ఒంట్లో శక్తి వున్నంతవరకు నెలకు సగటున రూ. 90 వేల కూలి దక్కుతుంది. అందుకే ఈ పోస్టుల కోసం శక్తివున్న వాళ్లు తీవ్రంగా పోటీ పడుతుంటారు. ఖాళీగా ఉన్న పోస్టును ఇటీవల మజ్జూదర్ యూనిన్ వేలం వేయగా ఓ వ్యక్తి రూ. 60 లక్షల 10 వేలకు గెలుచుకున్నాడు. ఐఎంఎఫ్ఎల్ డిపోలో ప్రస్తుతం 61 మంది కార్మికులు ఉన్నారు.. గతంలో హమాలీ పోస్టు రూ.20 లక్షలు నుంచి రూ.39 లక్షలు పలికింది. మద్యం కేస్‌లను లారీల నుంచి డిపోలో దించడం, డిపోల నుంచి వైన్స్‌కి వెళ్లే వాహనాల్లో ఎక్కించడమే హమాలీ పని. కూలి, ఎక్స్‌ట్రా కమిషన్ కూడా బాగానే ముడుతుంది.