Hamara Prasad arrested for making controversial comments on Ambedkar
mictv telugu

అంబేద్కర్ బతికి ఉంటే గాడ్సేలా చంపేవాడిని.. హమారా ప్రసాద్

February 10, 2023

Hamara Prasad arrested for making controversial comments on Ambedkar

రాజ్యాంత నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై రాష్ట్రీయ దళిత్ సేన ఫౌండర్ హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది ప్రజలు పూజించే దేవుళ్ల మీద ఇలాంటి పుస్తకాలు రాసిన అంబేద్కర్ కాలంలో తాను బతికి ఉంటే గాంధీని గాడ్సే చంపినట్టు తాను మరో గాడ్సేలా మారి అంబేద్కర్‌ని చంపేవాడినని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలతో కూడిన వీడియోను ఫిబ్రవరి 9న యూట్యూబుతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయి పోలీసుల దృష్టికి చేరింది.

దీంతో శుక్రవారం పోలీసులు హైదరాబాద్‌లోని అల్వాల్‌లో నివాసముండే హమారా ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. కొంతమంది ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఇంతకీ ఆ వీడియోలో ప్రసాద్ ఏమని మాట్లాడారంటే.. ‘అంబేద్కర్ 12 డిగ్రీలు చదివిన గొప్ప వ్యక్తి. ఒక దేశానికి రాజ్యాంగాన్ని రాశానని చెప్పుకునే మహా మేధావి. కానీ ఒక నాయకుడనేవాడు ప్రజలందరినీ సమానంగా చూడాలి. తనకు నష్టం కలిగినా ఎదుటివారిపై ద్వేషం పెంచుకోకూడదు. వివక్ష చూపకూడదు. లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరి చేయాలి. కానీ ఒక మతాన్ని కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ అంబేద్కర్ ఓ పుస్తకం రాశారు (అంబేద్కర్ రాసినట్టు చెప్తున్న ‘రాముని కృష్ణుని రహస్యాలు’ అనే పుస్తకాన్ని చూపెడుతూ) నేను గనుక అంబేద్కర్ ఉన్న రోజుల్లో ఈ పుస్తకం చదివి ఉంటే గాంధీని గాడ్సే చంపినట్టు అంబేద్కర్‌ని చంపి నేను మరో గాడ్సే అయ్యేవాడిని’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షేర్ చేశారు. రాష్ట్రం అగ్నిగుండం అయ్యేదాకా ఆగుతారా? అరెస్ట్ చేయరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.