న్యూజిలాండ్ ఎన్నికల్లో భారతీయుడి గెలుపు.. పార్లమెంట్లో ఎంట్రీ  - MicTv.in - Telugu News
mictv telugu

న్యూజిలాండ్ ఎన్నికల్లో భారతీయుడి గెలుపు.. పార్లమెంట్లో ఎంట్రీ 

October 19, 2020

Hamirpur lad elected MP in New Zealand.jp

దేశంలోనే కాదు విదేశాలలో కూడా భారతీయులు అనేక విజయాలను నమోదు చేస్తున్నారు. తాజాగా న్యూజిలాండ్ ఎన్నికల్లో ఓ భారతీయుడు గెలిచారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన డాక్టర్ గౌరవ్ శర్మ.. అక్టోబర్ 17న జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచి సత్తా చాటారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ జిల్లాకు చెందిన గౌరవ్ శర్మ.. 20 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మెడిసిన్ చదివిన గౌరవ్, డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజకీయాలు అన్నా ఆయనకు ఆసక్తి ఉండటంతో.. ఈ నెల 17న జరిగిన సాధారణ ఎన్నికల్లో గౌరవ్ శర్మ పోటీచేశారు. లేబర్ పార్టీ తరఫున  హమిల్టన్ వెస్ట్ ఎలక్టోరేట్ నుంచి ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 

అనుకున్నట్టుగానే ఎంపీగా భారీ విజయం సాధించారు. నేషనల్ పార్టీకి చెందిన అభ్యర్థిపై గౌరవ్ శర్మ.. 4,425 ఓట్ల మెజార్టీతో గెలుపొందారని న్యూజిలాండ్ ఎలక్టోరల్ కమిషన్ తెలిపింది. ఈ విషయం తెలిసి శర్మకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ గౌరవ్ శర్మకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరోపక్క న్యూజిలాండ్ ప్రధానిగా రెండోసారి జసిండా అర్డెర్న్‌ ఎన్నికయ్యారు. మూడు వారాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జసిండా అర్డెర్న్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా  ప్రధాని మోదీ, జసిండా అర్డెర్న్‌కు శుభాకాంక్షలు తెలిపారు.