ప్రేమించిన యువతి పెళ్లికి అంగీకరించడం లేదని ఓ యువకుడు ఆమె గొంతు కోశాడు. ఆ అమ్మాయితో పెళ్లి కోసం మతం కూడా మారినా.. చివరకు పెళ్లికి ఒప్పుకోలేదన్న అక్కసుతో కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. కడిపికొండకు చెందిన సివ్వి శ్రీనివాస్ (35) అదే గ్రామానికి చెందిన యువతి (26) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో అతడు ఆమె మతాన్ని స్వీకరించినట్లు తెలిసింది. కానీ పెళ్లికి యువతి కుటుంబసభ్యులు మాత్రం అంగీకరించలేదు. దీంతో వారిద్దరి మధ్య గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఇదే విషయమై మంగళవారం రాత్రి అలవాటుగా ప్రేయసి ఇంటికి వెళ్లిన యువకుడు పెళ్లి గురించి ఆమెను నిలదీశాడు. పెళ్లి చేసుకుందామని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో.. కోపంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. చేతిపై కూడా గాయం చేశాడు. వెంటనే అప్రమత్తమైన యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకుని చితకబాదారు. మడికొండ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వెంటనే బయల్దేరి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన యువతిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. యువతికి ప్రాణాపాయం లేదని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.