నా మొగుణ్ని ఉరి తీయండి.. ‘దిశ’నిందితుడి భార్య - MicTv.in - Telugu News
mictv telugu

నా మొగుణ్ని ఉరి తీయండి.. ‘దిశ’నిందితుడి భార్య

December 3, 2019

తనవాళ్లు తప్పు చేస్తే.. వాళ్లను మంచివాళ్లు అని సమర్థిస్తారా? తప్పు చేసినవాడు కొడుకైనా శిక్షించాల్సిందే అంటున్నారు దిశా ఘటనలో నిందితుల కన్నవాళ్లు. నా భర్త తప్పు చేస్తే ఉరి తీయండి అంటోంది రేణుక. రేణుక, దిశ ఘటనలో ఏ4 నిందితుడిగా ఉన్న చెన్నకేశవులు భార్య. అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రేమించి మనువాడిని తన భర్త ఇంత కిరాతకంగా మరో ఆడపిల్ల ఉసురు తీశాడని ఆ ఇల్లాలు సహించడం లేదు. ‘నా మొగుడు నేరం చేశాడని రుజువైతే ఉరి తీయండి. ఒక ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేశారు కాబట్టి నలుగురికి ఎలాంటి శిక్ష వేశారో నా భర్తకు కూడా అలాంటి శిక్షే వేయాలి’ అని చెప్పింది ఆమె. ఇప్పుడు ఆమె గర్భిణీ. 

తన భర్త చేసిన దారుణాన్ని తలచుకుని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తకు బాగా మద్యం తాగించి ఇలాంటి దారుణానికి ఒడిగట్టించారని ఆరోపించింది. తన భర్తకు ఉరి వేయొద్దని తాను కోరనని తెలిపింది. తన భర్తను తనకు అప్పగించాలని కోర్టును కోరినంత మాత్రాన తనకు అప్పగిస్తుందా అని ప్రశ్నించింది. తన భర్త కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని రేణుక తెలిపింది. అందువల్ల గత కొద్దిరోజులుగా ఇంటి దగ్గరే ఉంటున్నాడని.. అయితే స్నేహితులు వచ్చి తీసుకెళ్లడంతో ఈ ఘోరానికి పాల్పడ్డారని వాపోయింది.

Hang my Husband.

చెన్నకేశవులు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రతీ ఆర్నెళ్లకు ఒకసారి నిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. మెడికల్ రిపోర్ట్‌లో కూడా అదే తేలడంతో జైలు సిబ్బంది సైతం ఆర్నెళ్లకు ఒకసారి డయాలసిస్ చేయిస్తామని తెలిపారు. మరోవైపు చెన్నకేశవులు తల్లిదండ్రులు సైతం తమ కొడుకు చేసిన పనిని తలచుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నకేశవులు పుట్టినప్పుడు తాము ఎంతో సంబరపడ్డామని.. అయితే ఇలాంటి పనులు చేసినందుకు చాలా బాధగా ఉందని వాపోయారు. 

కాగా, ఈనెల 27న సాయంత్రం దిశను షాద్‌నగర్‌లో అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. దోషులను ఉరి తీయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.