14 నెలల పసికందుపై అత్యాచారం నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రం అట్టుడుకుతోంది. అత్యాచారానికి పాల్పడింది బిహార్ వాడు అంటూ గుజరాతీలు.. వలస కార్మికులపై దాడులు చేస్తున్నారు. పలు జిల్లాల్లో హింస చెలరేగి, తీవ్ర ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. నిందితుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకు కారణంగా గుజరాతేతర వ్యక్తులపై జరుగుతున్న దాడులపై నిందితుడి తల్లి రమావతి దేవి ఆవేదన వ్యక్తం చేశారు.
‘నా కొడుకు తప్పు చేశాడని రుజువైతే కఠినంగా శిక్షించండి. ఉరితీయండి. నా కొడుకు వల్ల బిహారీలందరినీ శిక్షించొద్దు. దయచేసి దాడులు ఆపేయండి’ అని ఆమె గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాని కోరారు. నిందితుడి తండ్రి మాట్లాడుతూ.. ‘ నాకొడుకు మైనర్, వాడి మానసిక పరిస్థితి సరిగా లేదు. ఎక్కువ చదువుకోలేదు. రెండేళ్లక్రితం ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఈ మధ్య గుజరాత్లో ఉన్నట్లు మాకు తెలిసింది’ అని తెలిపాడు.
దాడులపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్పందించారు.. ‘స్థానికేతరులు రాష్ట్రం విడిచి వెళ్లొద్దు. తిరిగి వెనకకు రండి. పోలీసులు భద్రతా చర్యలు తీసకుంటారు. ఉద్రిక్త పరిస్థితులు ఉన్న దగ్గర రాష్ట్రంలోని రిజర్వు పోలీసు బలగాలను పంపించాం. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.