కులమత రాజకీయాలకు తిరుగులేని వేదిక అయిన ఉత్తరప్రదేశ్‌లో రోజుకో ఉద్రిక్తత తలెత్తుతోంది. మథురలోని నందభవన్ ఆలయంలో ఇద్దరు ముస్లింలు నమాజ్ చదవిన ఉదంతాన్ని మరకవ ముందే రివర్స్ సీన్లో అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని గోవర్ధన్ ప్రాంతంలో ఓ మసీదులో మంగళవారం నలుగురు హిందూ యువకులు హనుమాన్ చాలీసా చదివారు. దీంతో అక్కడి ముల్లాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెంటనే నలుగురిని అరెస్ట్ చేశారు. నంద భవన్ ఆలయంలో జరిగినదానికి కౌంటర్‌గా మసీదులో చాలీసా వల్లించినట్లు భావిస్తున్నారు. మతసామరస్యాన్ని దెబ్బతీసే వారిని సహించబోమని, చట్టప్రకారం శిక్షించి తీరతామని పోలీసులు హెచ్చరించారు. కాగా, నంద భవన్ సంఘటనలో అరెస్ట్ చేసిన ఫైజల్‌ను పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. నిందితులు తమకు హిందూమతం, ఇస్లాం మతం రెండూ తమకు ఇష్టమని నిందుతులు ప్రచారం చేసుకున్నారు. తొలుత దేవుణ్ని చూస్తామని చెప్పి తర్వాత నమాజ్ చేశారు. ఫైజల్, మహ్మద్ నమాజ్ చేస్తుండగా మిగిలిన ఇద్దరూ వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మరికొందరు కూడా వీడియో తీశారు. సామరస్యం మంచిదేగాని ఆలయంలో ఇలాంటివి సరికావని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఎవరి మతం వాళ్లకు పవిత్రమని, ఆలయంలో నమాజ్ చేయడం వల్ల సామరస్యానికి బదులు అందోళన రేగుతుందని సేవదార్ కన్హా గోస్వామి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు.