హనుమాన్ చాలీసా.. 18వేల మందికి పోలీసుల నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

హనుమాన్ చాలీసా.. 18వేల మందికి పోలీసుల నోటీసులు

May 4, 2022

మ‌హారాష్ట్రలో లౌడ్ స్పీక‌ర్ల వివాదం మ‌రింత‌గా ముదురుతోంది. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే మసీదులపై లౌడ్ స్పీకర్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”మా పార్టీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. చాలా మంది కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తున్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నిబంధనలను తప్పనిసరిగా పాటించేవారిపైనే ఎందుకు కేసులు పెడుతున్నారు? కొంతమంది మా ఆంతర్యాన్ని అర్థం చేసుకొని, మాకు మద్దతిస్తున్నారు వారికీ ధన్యవాదాలు” అని ఆయన అన్నారు. ఒకవేళ లౌడ్ స్పీకర్లలో అజాన్ చదివినట్టు తమకు తెలిస్తే, తాము కూడా హనుమాన్ చాలీసాను చదువుతామని రాజ్ థాకరే తేల్చి చెప్పారు.

ఈ లౌడ్ స్పీకర్ల అంశంపై బుధవారం శరద్ పవార్ నేతృత్వంలో మహావికాస్ అఘాడీ సమావేశమైయ్యారు. సమావేశంలో మహారాష్ట్రలో శాంతి భద్రతల పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,140 మసీదులు ఉండగా, అందులో 135 మసీదుల్లో లౌడ్ స్పీకర్‌తో అజాన్ చదివారని హోం శాఖ తెలపడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు.

మరోపక్క హనుమాన్ చాలీసా చదివేందుకు 18 వేల మంది ఎంఎన్ఎస్ కార్యకర్తలు లౌడ్ స్పీకర్లను సిద్ధం చేస్తుండడంతో, మహారాష్ట్ర పోలీసులు 149 సెక్షన్ కింద వారికి నోటీసులను జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఎన్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలు హనుమాన్ చాలీసా చదివేందుకు ప్రయత్నించారని, మత కలహాలు చెలరేగేందుకు రెచ్చగొట్టారన్న అభియోగాలతో వారిపై కేసును నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో వారికి నేడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.