మసీదుపై హనుమంతుడి జెండా.. ఢిల్లీలో ఉద్రిక్తత  - MicTv.in - Telugu News
mictv telugu

మసీదుపై హనుమంతుడి జెండా.. ఢిల్లీలో ఉద్రిక్తత 

February 26, 2020

గత నాలుగు రోజులుగా తూర్పు, ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొంద మంది ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే కొంత మంది వ్యక్తులు మసీదుపై హనుమాన్ జెండాను ఎగురవేయడం తీవ్ర ఉద్రిక్తలను పెంచింది. అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న బడీ మసీదు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

కొంత మంది నిరసనకారులు మూకుమ్మడిగా మసీదు వైపు దూసుకువచ్చారు. వారిలొ కొంత మంది జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మినార్‌పైకి ఎక్కి హనుమాన్ జెండాను ఎగురవేశారు. మసీదుకు నిప్పుపెట్టడంతో అది పూర్తిగా ధ్వంసం అయింది. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఖురాన్‌లోని పేజీలు చిరిగిపోయి చిందరవందరగా పడి ఉన్నాయి.  హిందువులు మెజార్టీగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడంతో అంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ దాడి ఘటనపై జాతీయ మీడియా ప్రతినిధులు స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. కొంత మంది స్థానికులను ఓ జర్నలిస్టు ప్రశ్నించగా  తాము ముస్లింల ప్రార్థన మందిరంపై దాడి చేసినట్టుగా ప్రకటించుకున్నారు.

వరుస ఘటనల కారణంగా ఇప్పటి వరకు 20 మంది మరణించారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల రాళ్ల దాడుల్లో పలువురు పోలీసులు, పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఓ పోలీసు వాహనం కూడా ఉందని, అయినా ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.గాయాలతో ఆస్పత్రిలో చేరిన కొందరికి బుల్లెట్ గాయాలు, మరికొందరికి కత్తిపోట్లున్నాయని తేగ్ బహదూర్  వైద్యులు చెబుతున్నారు. ఇంకా కొంత మంది పరిస్థితి విషమంగానే ఉందన్నారు. కాగా ఈ దాడుల కారణంగా డిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర బలగాలు ఆయా ప్రాంతాల్లో మోహరించి ఎవరూ బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

అమిత్ షా రాజీనామాకు సోనియా డిమాండ్ : 

ఈ హింసపై పలువురు రాజకీయనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది బీజేపీ నేతల వ్యాఖ్యలతో భయానక, విద్వేషపూరిత వాతావరణాన్నినెలకొందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. గత 72 గంటలుగా ఢిల్లీ పోలీసులు అచేతనంగా ఉన్నారని విమర్శించారు. దీని వెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులకు కేంద్రం, హోంమంత్రిదే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలన్నారు.