యువనటుడిని నిలువునా దోచుకున్న రౌడీలు  - MicTv.in - Telugu News
mictv telugu

యువనటుడిని నిలువునా దోచుకున్న రౌడీలు 

September 28, 2020

Happu Ki Ultan Paltan Actor Sanjay Choudhary Looted, Threatened by Goons in Broad Daylight in Mumbai

కరోనా దెబ్బకు ఇన్నాళ్లు చేతినిండా దోపిడీలు లేక దొంగుల, గూండాలు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. దాడులు, బెదిరింపులకు దిగి మరీ దోపిడీలు చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా ఓ బాలీవుడ్ సీరియల్ నటుడిని కొందరు గూండాలు బెదిరించి పర్సులో ఉన్న సొమ్మును లాక్కెళ్లిపోయారు. ఈ ఘటన గురించి సదరు నటుడు వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ‘హప్పు కి ఉల్తాన్‌ పల్తాన్‌’ సీరియల్ నటుడు సంజయ్‌ చౌదరికి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. 

వీడియోలో సంజయ్‌ చౌదరి మాట్లాడుతూ.. ‘మధ్యాహ్నం సమయంలో నేను మీరా రోడ్డు నుంచి షూటింగ్‌ జరిగే నైగావ్‌ ప్రాంతానికి కారులో వెళ్తున్నాను. ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి నా కారు విండోని తట్టి పార్క్‌ చేయమని అన్నాడు. ఆ వెంటనే మరాఠీలో తిట్టేస్తున్నాడు. నాకేం అర్థంకాలేదు. నేను చాలా జాగ్రత్తగా డ్రైవ్‌ చేస్తున్నానే.. ఏ వాహనాన్ని ఢీ కొట్టలేదని ధీమాగా ఉన్నాను. ఇంతలో అతను గ్లాస్‌ను కిందకి దించమన్నాడు. నేను గ్లాస్ కిందకు దించగానే.. వెంటనే అతడు నా కారు డోర్‌ తెరిచి లోపలకి వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత నేను తన స్కూటీని ఢీ కొట్టానని.. అందుకోసం అతడికి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఇంతలో మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి, ముగ్గురూ నన్ను బెదిరించసాగారు. నా దగ్గర అంత మొత్తం లేదని చెప్పాను. ఏటీఎంకి వెళ్లి డ్రా చేసి తీసుకురమ్మన్నారు. లేదంటే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. నా ఫోన్‌ లాక్కున్నారు. డబ్బులిస్తేనే మొబైల్‌ ఇస్తామన్నారు. నా దగ్గర అంత డబ్బు లేదని వాలెట్‌ తెరిచి చూపించాను. దానిలో ఒక ఐదు వందల రూపాయల నోటు, ఒక రెండు వందల రూపాయల నోటు.. మొత్తం రూ.700 మాత్రమే ఉన్నాయి. వారు ఆ మొత్తం తీసుకుని వెళ్లిపోయారు. వాళ్లు గూండాలు అన్న విషయం నాకు తర్వాత అర్థం అయ్యింది. ఈ సందర్భంగా అభిమానులందరికి నేను చెప్పేది ఒక్కటే.. అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి’ అని సంజయ్ చౌదరి తెలిపాడు.