happy birthday to comedy king Brahmanandam
mictv telugu

అతని చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కాదు…చెరిగిపోయేది అంతకన్నా కాదు

February 1, 2023

హాస్యం మానవ రూపంలో భూమి మీద పడితే ఏమవుతుందో తెలుసా….బ్రహ్మానందం అనే మనిషిలా మారతారు.అవును హాస్యానికి మరో పేరైన బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. మూడు దశాబ్దాలుగా విరామం లేకుండా నవ్వించారు. బ్రహ్మానందం ఈ పేరు ఏ క్షణాన పెట్టారో కానీ ఇప్పటికి ఆనందం పంచుతూనే ఉన్నారు. కామెడీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. నవ్వుల ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్నారు. బాధలో అయినా సంతోషంలో అయినా, పనిలో అయినా పాటలో అయినా ఆయన పేరు వినబడితే చాలు పెదాలపై చిరునవ్వు ఇట్టే వస్తోంది. దటీజ్ బ్రహ్మానందం. తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటుూ కొన్ని పేజీలు లిఖించుకున్న హాస్యనటుడు.

తెలుగు సినీ ప్రేక్షకులు బ్రహ్మీ అని ముద్దుగా పిలుచుకునే బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన తన కామెడీ టైమింగ్ తో నవ్వుల పువ్వులు పూయిస్తూ ప్రతి ఒక్కరికి మంచి వినోదాన్ని అందిస్తూ ఉంటారు. అందుకే బ్రహ్మానందం లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 2000 సంవత్సరం మధ్యకాలంలో బ్రహ్మానందం ప్రతి సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేవారు.దాదాపు చాలా సినిమాలు ఈయన కామెడీ తోనే హిట్ అయ్యాయి అనడంలో సందేహం లేదు. నవరసాలు పండించగల అద్భుత హాస్యనటుడు అని చెప్పవచ్చు. రేలంగి, పద్మనాభం వంటి గొప్ప హాస్యనటుల తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకున్నారు బ్రహ్మానందం. అందుకే అందరూ ఆయనను చిన్న రేలంగి అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు .

ఎక్కడో ఓ చిన్న లెక్చరర్‌గా జీవితం మొదలుపెట్టిన ఈయన.. ఈ రోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడంటే.. దాని వెనక ఎంతో కష్టం దాగుంది. తెలుగు సినిమా హాస్య ప్రపంచంలో ఎంతోమంది తారలున్నా.. బ్రహ్మానందం మాత్రం ధృవతార. 1250 సినిమాలకు పైగా నటించి.. ఆడియన్స్‌కు బోర్ కొట్టించకుండా నవ్వించాడు బ్రహ్మి.టాలీవుడ్‌లో ఈయన ఓ బ్రాండ్. తెర‌పై ఆయ‌న కాదు.. అత‌డి బ‌ట్ట‌త‌ల కనిపించినా చాలు హీరోకి ప‌డ్డ‌న్ని విజిల్స్ ప‌డ‌తాయి. గ‌త రెండు ద‌శాబ్దాల నుంచి బ్ర‌హ్మి ప్ర‌స్థానం ఎదురులేకుండా సాగుతుంది. స్టార్ హీరోల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని క్రేజ్ తో ఇన్నాళ్ళూ నెట్టుకొచ్చాడు బ్ర‌హ్మానందం.

మొదట్లో చిన్న సినిమాలు చేసినా కూడా.. 1987లో జంధ్యాల తెరకెక్కించిన అహ నా పెళ్లంటలో ఈయన చేసిన అరగుండు పాత్ర అదిరిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు బ్రహ్మానందం. ఈ 35 ఏళ్ళ కెరీర్‌లో అరడజన్ నందులతో పాటు.. ఓ ఫిల్మ్ ఫేర్.. మూడు సైమా అవార్డులు సొంతం చేసుకున్నాడు ఈ లెజెండరీ కమెడియన్. ప్రస్తుతం సినిమాలు మానేసినా మీమ్, జిఫ్ లతో మాత్రం ఇంకా జనాలని నవ్విస్తూనే ఉన్నారు. బ్రహ్మానందం జిఫ్ వాడకుండా ఏ ఒక్క తెలుగువాడూ ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. ఈ మీమ్స్‌కు అయితే బ్రహ్మానందం కులదైవం. ఆయన లేకుండా ఒక్క మీమ్ కూడా ముందుకు కదలదు. ఇది కేవలం బ్రహ్మికి మాత్రమే సాధ్యమైన రికార్డు. ఒక‌ప్పుడు బ్ర‌హ్మి ఉంటేనే సినిమా.. కానీ ఇప్పుడు కొత్త కమెడియన్లు చాలా మంది రావడంతో తనకు తానుగా కాస్త పక్కకు జరిగాడు బ్రహ్మి. కొత్త వాళ్ళకు అవకాశాలు ఇస్తూ.. తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తున్నాడు ఈయన.

బ్రహ్మానందం ఇంటిపేరు కన్నెగంటి. ఫిబ్రవరి 1, 1956 లో సత్తెనపల్లి, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. మాస్టర్ ఆఫ్ డిగ్రీ తెలుగు చేశారు. సినిమాలకు ముందు అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. అహానా పెళ్ళంట సినిమాతర్వాత బహ్మానందం కామెడీ రారాజుగా మారిపోయారు. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.దర్శకులు ఆయన కోసమే ప్రత్యేకించి పాత్రను రాసుకునేవారు. పాతికేళ్ళు న‌వ్వుల జోరూ, బ్రహ్మీ హోరూ కొన‌సాగుతూనే ఉంది. అర‌గుండు, ఖాన్‌దాదా, మైఖెల్ జాక్సన్‌, మెక్‌డోల్డ్ మూర్తి, భ‌ట్టు, గ‌చ్చిబౌలి దివాక‌ర్, ప‌ద్మశ్రీ‌, ప్రణ‌వ్‌, జ‌య‌సూర్య ఇలా బ్రహ్మీ ఏ రూపంలో వ‌చ్చినా జ‌నం ప‌డీ ప‌డీ న‌వ్వారు. పొట్టలు చెక్కలు చేసుకొన్నారు. త‌న‌ న‌వ్వుల‌తో ద‌శాబ్దాల నుంచి వినోదాల వైద్యం చేస్తున్న డాక్టర్ ఆయ‌న‌. చ‌రిత్ర దేముందిరా, చింపేస్తే చిరిగిపోతుంది అంటాడు.. కానీ బ్రహ్మానందం చ‌రిత్ర.. చిరిగిపోయేది కాదు, చెరిగిపోయేది కాదు. అది సువ‌ర్ణాక్షరాల‌తో లిఖించ‌బ‌డింది.

ప్రస్తుతం బ్రహ్మి కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు బ్రహ్మానందం. ఇప్పటి వరకు ఈయన కెరీర్‌లో చేయని పాత్ర ఇది. మరోవైపు పంచతంత్రం సినిమాలో కూడా వేద వ్యాస్ అంటూ మరో సీరియస్ పాత్రలో నటిస్తున్నారు బ్రహ్మానందం.