మనకంటే పాకిస్తాన్ ప్రజలే సంతోషంగా ఉన్నారు! - MicTv.in - Telugu News
mictv telugu

మనకంటే పాకిస్తాన్ ప్రజలే సంతోషంగా ఉన్నారు!

March 15, 2018

సంతోషం సగం బలం అంటారు. మనసు సంతోషంగా ఉంటే ఆరోగ్యం బావుంటుంది. దేశంలోని ప్రజలంతా సంతోషంగా దేశం ముందుకెళ్తుంది. సంతోషం కోసం భూటాన్ వంటి దేశాలు ఏకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశాయి. అయితే నానా కారణాల వల్ల కొన్ని దేశాల ప్రజలు సంతోషంగా లేరు. భారతీయుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. సంతోషకర దేశాల జాబితాలో గత ఏడాదికంటే 11 స్థానాలు పడిపోయి 133వ స్థానంలో ఉంది. విశేషమేమంటే నిత్యం ఉగ్రవాద దాడులు, నానా హింసతో అల్లాడిపోయే పాకిస్తాన్ ప్రజలు మనకంటే సంతోషంగా ఉండడం. ఆ దేశానికి ఏకంగా 75వ ర్యాంకు దక్కింది. మంచి జీవన ప్రమాణాలు, సంక్షేమ పథకాలు, చవక ధరలు వంటి సానుకూల అంశాలే పాక్ ప్రజల సంతోషానికి కారణం.

ఆ దేశాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత, అవినీతి, సంతోషం తదితరాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితా ప్రకారం.. భారత్ కంటే చాలా ‘వెనుకబడిన’ దేశాలు సంతోషంలో మాత్రం ముందంజలో ఉన్నాయి. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంకలు గౌరవప్రదమైన ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. చివరకు నియంత పాలన అని విమర్శలు ఎదుర్కొనే చైనాలోనూ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు. ఫిన్లాండ్ తొలిస్థానంలో ఉంది.స్వల్పస్థాయి సూర్యరశ్మి, శీతల వాతావరణంతోపాటు ఎక్కువ వేతనాలు, సంక్షేమ పథకాలు, ఆరోగ్యంపై శ్రద్ధ తదితర కారణాలతో ఫిన్లాండ్ ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఫిన్లాండ్ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, నార్వే, ఐస్‌ల్యాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, స్విట్జర్లాండ్, మెక్సికో తదితర దేశాలున్నాయి. అమెరికా 18 స్థానంలో ఉండగా, బురండీ ఈ జాబితాలో అట్టడుగున పడి ఉంది.

world happiness Index