ఇంగ్లీష్‌లో రాసేముందు ఒకసారి చదువుకో.. పాక్ నటికి భజ్జీ పంచ్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇంగ్లీష్‌లో రాసేముందు ఒకసారి చదువుకో.. పాక్ నటికి భజ్జీ పంచ్..

October 9, 2019

Harbhajan .

ఇంగ్లీష్‌లో రాసేటప్పుడు కాస్త చదువుకో అంటూ పాకిస్తాన్ నటి వీణా మాలిక్‌కు  టీమిండియా క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్ సలహా ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్యా ట్వీట్ల పర్వం కొనసాగింది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగాలతో శాంతిని నెలకొల్పాలని ఒక క్రీడాకారుడిగా తాను కోరుకుంటున్నట్లు భజ్జీ పోస్టు చేశాడు. భజ్జీ పోస్టుపై వీణా స్పందించింది. హర్భజన్‌ను ఉద్దేశిస్తూ.. ‘మా ప్రధాని ఇమ్రాన్‌ శాంతి గురించే మాట్లాడుతున్నారు. కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేస్తే దారుణ పరిస్థితులు తలెత్తుతాయి. పైగా హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకుంటాయనే వాస్తవాలను ఆయన చెప్పారు. అంతేగానీ, అక్కడ ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని పేర్కొనలేదు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనల్ని మాత్రమే చాలా స్పష్టంగా చెప్పారు. నీకు ఇంగ్లీష్‌ అర్థం కాదా?’ అని ఆమె ట్వీట్ చేసింది. 

ఆ ట్వీట్‌పై భజ్జీ తనదైన శైలిలో స్పందించాడు. ఆమె రాసిన ఓ పదం (Surley)కి బదులు(surly)గా తప్పుగా రాసింది. దానిని ఎత్తిచూపుతూ.. surly అంటే ఏమిటి? అది Surelyయేనా? అంటూ నవ్వుల ఎమోజీ పెడుతూ పంచ్ విసిరాడు. ఇంకెప్పుడైనా ఇంగ్లీష్‌లో రాసేటప్పుడు ఒకసారి బాగా చదువుకో అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. కాగా, ఇటీవల అంతర్జాతీయ వేదికపై ఇమ్రాన్‌ భారత్‌పై విషం చిమ్మేలా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హార్బజన్ సింగ్ అక్టోబర్ 2న ఘాటుగా స్పందించాడు. ఇమ్రాన్‌ ప్రసంగంతో భారత్‌కు అణుయుద్ధం సంకేతాలు అందుతున్నాయని, ఒక మేటి క్రీడాకారుడైన ఆయన మాటలు ఇరు దేశాల మధ్య మరింత ద్వేషాన్ని వెదజల్లేలా కనిపిస్తున్నాయని అన్నాడు. ఇదిలా ఉండగా ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై టీమిండియా క్రికెటర్లు వీరేందర్‌ సెహ్వాగ్‌, గంగూలీ సైతం ఘాటుగా స్పందించారు. ఇమ్రాన్ మాటలు దారుణమని, ఒక అత్యుత్తమ ఆటగాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పద్ధతికాదని గంగూలీ ట్వీట్ చేశాడు.