రక్తమోడుతున్నా జట్టు కోసం.. హాట్సాఫ్ - MicTv.in - Telugu News
mictv telugu

రక్తమోడుతున్నా జట్టు కోసం.. హాట్సాఫ్

May 14, 2019

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఒంటరి పోరాట చేసి జట్టును విజయపు అంచులదాకా తీసుకెళ్లాడు. దీంతో అందరూ చెన్నై గెలుపు ఖాయమని అనుకుంటున్న తరుణంలో వాట్సన్ రనౌట్ అయ్యాడు. దీంతో ముంబైకి మ్యాచ్ అనుకూలంగా మారింది. కాగా వాట్సన్‌కు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫైనల్ మ్యాచ్‌లో వాట్సన్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతని మోకాలికి గాయమైంది. అయితే ఆ విషయాన్ని వాట్సన్ ఎవరికీ చెప్పకుండా గాయంతోనే మ్యాచ్‌ ఆడాడు. గాయం పెద్దదిగా మారినా.. జట్టు కోసం చివరికిదాకా పోరాడాడు. కాలు నుంచి రక్తమోడుతున్నా.. ఎవరికీ చెప్పకుండానే బ్యాటింగ్ చేశాడు. రక్తంతో వాట్సన్ ప్యాంట్ తడిచిపోయినా గ్రౌండ్‌ను మాత్రం వదల్లేదు. మ్యాచ్ ఉట్కంఠగా సాగడంతో ఎవరూ వాట్సన్‌కు తగిలిన గాయాన్ని గమనించలేదు. చెన్నై ఆటగాడు హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ..‘వాట్సన్ నీకు హాట్సాఫ్’ అంటూ పోరాటపటిమను మెచ్చుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం వాట్సన్‌‌కు ఆరు కుట్లు పడ్డాయని హర్భజన్ పేర్కొన్నాడు.