'Hardik Pandya finishes it off in style, revenge taken': IND fans celebrate thrilling win over PAK
mictv telugu

అట్లుంటది మనతోని.. పాండ్యా ఆటిట్యూడ్ వీర లెవల్..

August 29, 2022

లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా.. అన్నట్లు లాస్ట్ బాల్ సిక్సర్ కొట్టి టీమిండియా అభిమానులతో పాటు, దేశ ప్రజలకి మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు హార్థిక్ పాండ్యా. అసలు దాయాదుల మ్యాచ్‌కున్న కిక్కే వేరు. బరిలో భారత్, పాక్‌ తలపడితే అది లీగా… నాకౌటా… అనేది ఉండదు! ఎక్కడ ఆడినా… ఎప్పుడు ఎదురుపడినా అది ‘ఫైనల్‌’ను మించిన సమరమే! అలాంటి మ్యాచ్‌ ఆదివారం ఆసియా కప్‌ టి20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థుల మధ్య ఉత్కంఠగా జరిగింది. భారీ స్కోర్లు నమోదు కాకపోయినా చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఖతర్నాక్ ప్రదర్శనతో రెచ్చిపోయాడు.

ముఖ్యంగా ఆఖరి ఓవర్ లో భారత్ విజయానికి 7 పరుగులు అవసరం అయిన తరుణంలో ఎటువంటి ఒత్తిడికి గురి కాని హార్దిక్ కూల్ గా తన పనిని పూర్తి చేశాడు. ఆఖరి ఓవర్ లో 7 పరుగులు చేయాల్సిన తరుణంలో నవాజ్ వేసిన తొలి బంతికి రవీంద్ర జడేజా బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ సింగిల్ తీసి హార్దిక్ కు స్ట్రయికింగ్ వచ్చేలా చేశాడు. మూడో బంతిని హార్దిక్ కవర్స్ లోకి ఆడగా.. నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. పరుగు కోసం దినేశ్ కార్తీక్ ప్రయత్నించినా వద్దంటూ హార్దిక్ వారించాడు. మూడు బంతులు పూర్తి అయ్యాక.. భారత్ విజయం కోసం 6 పరుగుల దూరంలో నిలిచింది. నాలుగో బంతిని లాంగాన్ దిశలో సిక్సర్ బాదిన హార్దిక్ భారత్ కు అద్బుత విజయాన్ని ఖాయం చేశాడు.

ఒక్క బ్యాటింగ్ మాత్రమే కాదు.. అంతకుముందు బ్యాటింగ్‌కి దిగిన పాక్ టీమ్‌కు తన బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు పాండ్యా. భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. ఆల్‌రౌండర్‌గా తన విలువను మరోసారి చాటుకుంటూ హార్దిక్‌ పాండ్య అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కచ్చితమైన షార్ట్‌ పిచ్‌ బంతులతో కీలక సమయంలో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి మెరుగైన స్కోరు ఆశలకు చెక్‌ పెట్టాడు. మొత్తంగా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో హార్థిక్ తన అద్భుత ప్రదర్శనతో భారత్‌ను గెలిపించాడు. దాంతో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించింది.