Hardik Patel slams Congress for abusing Ambani, Adani
mictv telugu

అంబానీ, అదానీలను తిట్టడం కరెక్ట్ కాదు.. హార్ధిక్ పటేల్

May 19, 2022

Hardik Patel slams Congress for abusing Ambani, Adani

ప్రతీదానికి అంబానీ, అదానీలను నిందించడం కరెక్ట్ కాదని.. ప్రధానిపై ఉన్న కోపాన్ని గుజరాత్‌కు చెందిన వారిపైన చూపడం తగదని యువనేత హార్ధిక్ పటేల్ అన్నారు. కష్టపడి పైకొచ్చిన అలాంటి వ్యాపారవేత్తలపై అనవసరంగా విమర్శలకు దిగడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తరచుగా అదానీ, అంబానీలను విమర్శిస్తున్న నేపథ్యంలో హార్ధిక్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తన మూడేళ్ల రాజకీయ జీవితం వృధా అయిపోయిందని హార్ధిక్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు ఏ పనీ అప్పగించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆయన వాపోయారు.

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాక తాను బీజేపీలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. కమలం పార్టీలో చేరిక‌పై బీజేపీతో ఎలాంటి సంప్ర‌దింపులు జ‌ర‌ప‌లేద‌ని అన్నారు. బీజేపీలో చేర‌డంపై ఇప్పటివ‌ర‌కూ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీలో చేర‌వ‌ద్ద‌ని తమ సామాజిక వర్గం ప‌టిదార్ నేత‌లు హెచ్చ‌రించార‌ని.. వారి మాట పెడచెవిన పెట్టినందుకు వారికి క్షమాప‌ణ‌లు చెబుతున్నాన‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో పూర్తిగా కూరుకుపోయింద‌ని హార్ధిక్ అన్నారు.