హరీష్ రావు గారు అమెరికాకు రండ్రి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 'మిషన్ కాకతీయ'కార్యక్రమానికి ఖండాంతర ఖ్యాతి లభిస్తున్నది. దేశ విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.'భారత్ ఎదుర్కుంటున్న సవాళ్ళు, లౌకికవాదం-బహుళత్వం'పై అక్టోబర్ 7న అమెరికాలోని చికాగో లో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనవలసిందిగా టి.ఎస్.ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు బుధవారం నాడు ఆహ్వనం అందింది. భారతీయ సంతతికి చెందిన ముస్లింల అమెరికా సమాఖ్య(ఏ. ఎఫ్.ఎం.ఐ) ఈ సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాలని మంత్రి హరీశ్ రావును ఏ.ఎఫ్. ఎం.ఐ.అధ్యక్షుడు రజియ అహ్మద్ తన లేఖలో కోరారు.
తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య, బడుగు వర్గాల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నారని మంత్రిని ఏ. ఎఫ్.ఎం.ఐ. అభినందించింది.ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంతో 17వేల చెరువుల ను పునరుద్ధరించి 5 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు తో పాటు మొత్తం 15 లక్షల ఎకరాలకు మైనర్ ఇరిగేషన్ కింద సాగునీరందించడం చారిత్రాత్మక ఘట్టమని ఆ సంస్థ వ్యాఖ్యానించింది. తెలంగాణ గ్రామీణ సామాజిక, ఆర్ధిక వ్యవస్థలో అనూహ్యమైన మార్పు వచ్చిందని అమెరికా సంస్థ అభిప్రాయపడింది. మంత్రి హరీశ్ రావును 'విజనరీ'అని పొగిడింది.రైతులు, సామాన్య ప్రజల కోసం నిరంతరం నిబద్ధతతో పనిచేయడం వల్లనే మిషన్ కాకతీయ పేరుతో చెరువులు పునరుద్దరణకు నోచుకోగలిగినట్టు ఏ.ఎఫ్.ఎం.ఐ.పేర్కొంది.
తెలంగాణ భారతదేశానికి దిక్సూచి అవుతోందని ఆ సంస్థ అభిప్రాయపడింది. "యు.ఎస్.ఏ.లోని పలు రాష్ట్రాల్లో స్థిరపడిన, నివసిస్తున్న తెలంగాణ ప్రజల లో మీకు ఎందరో అభిమానులు ఉన్నారు. మీకు గొప్ప ఫాలోయింగ్ ఉన్నది"అని మంత్రి కి రాసిన లేఖలో ఏ.ఎఫ్.ఎం.ఐ అధ్యక్షుడు పేర్కొన్నారు.