సిగ్గుచేటు.. ‘బీజేపీ ఫ్రీ కరోనా టీకా’పై హరీశ్ రావు ఫైర్  - MicTv.in - Telugu News
mictv telugu

సిగ్గుచేటు.. ‘బీజేపీ ఫ్రీ కరోనా టీకా’పై హరీశ్ రావు ఫైర్ 

October 23, 2020

Harish Rao angry on 'BJP free corona vaccine.jp

బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే కరోనా టీకాను ఉచితంగా వేయిస్తామని పేర్కొంది. ఈ విషయమై తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. కరోనా టీకా విషయంలో బీజేపీ తీరు సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కరోనా మందును ఉచితంగా పంపిణీ చేస్తామని అనడం సిగ్గుచేటు అన్నారు. బీహార్‌లో ఉచితంగా కరోనా మందును పంపిణీ చేస్తానన్న కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. 

బీజేపీ గెలిస్తే బాయికాడ మీటర్లు, కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కష్టాలు మొదలవుతాయని మండిపడ్డారు. ‘ముంపు ప్రభావిత గ్రామాల్లో సైతం టీఆర్ఎస్‌కు  ఏకగ్రీవంగా మద్దతు పలుకుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆశయసాధనకు అభ్యర్థి సుజాత ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని దుబ్బాక ప్రజలను కోరుతున్నా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. సంక్షేమ పథకాలు, ప్రజా అభివృద్ధి పథకాలు అమలు చేయడంలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది. దివంగత మాజీ మంత్రి ముత్యంరెడ్డి హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా లేదు. దీంతో కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లకు బదులుగా అదనపు ట్రాన్స్‌ఫార్మర్ మంజూరుకు మరో 30 వేల రూపాయలు చెల్లించడంతో రైతులపై భారం పడేది. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో నేను భాగస్వామినై సిద్ధిపేట తరహాలో కృషి చేస్తాను’ అని హరీశ్ అన్నారు.