నా పుట్టుకా, చావూ టీఆర్ఎస్‌లోనే.. పిచ్చిరాతలు రాస్తే జైలుకే.. హరీశ్ - MicTv.in - Telugu News
mictv telugu

నా పుట్టుకా, చావూ టీఆర్ఎస్‌లోనే.. పిచ్చిరాతలు రాస్తే జైలుకే.. హరీశ్

March 9, 2018

తాను 40 మంది ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ‘నా పుట్టుక టీఆర్ఎస్‌లోనే, చావు కూడా టీఆర్ఎస్‌లోనే. నేను బీజేపీలోకి వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో పిచ్చి రాతలు పోస్ట్ చేసేవారిపై  క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలి. నేను క్రమశిక్షణ గల టీఆరఎస్ కార్యకర్తను. కేసీఆర్ ఆదేశాలు శిరసా వహిస్తాను..’ అని ఆయన శుక్రవారం స్పష్టం చేశారు.

‘నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కూడా కోరాను. మేం ఉద్యమాలు, త్యాగాల ద్వారా వచ్చామేగాని పదవుల కోసం కాదు.. మా నాయకుడు కేసీఆర్ ఆదేశాలపై మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులకు గడ్డిపోచలా రాజీనామాలు చేసి, జైలుకెళ్లిన చరిత్ర మాకుంది. రాజకీయ లబ్ధికోసమే నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. బీజేపీలోకి వెళ్లాలనే ఆలోచన కలలో కూడా నాకు రాలేదు. టీఆర్ఎస్ పార్టీకి త్యాగాలు తప్ప ద్రోహాలు తెలియదు..’ అని హరీశ్ అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే, కేటీఆర్ సీఎం అవుతారని, దీంతో హరీశ్ బీజేపీలో చేరతారని కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. 40 ఎమ్మెల్యేలతో కలసి హరీశ్ రావు బీజేపీలో చేరుతున్నారని ఏబీఎన్ చానల్లో వార్తలు వచ్చినట్లు మార్ఫింగ్ చేసిన క్లిప్పును ప్రచారం చేస్తున్నారు.

కాగా, కాంగ్రెస్ నేత బస్సు యాత్రలో పార్టీ నేతలు చేసిన విమర్శలపై హరీశ్ విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయని ఆ పార్టీ ఇప్పుడు కువిమర్శలకు పాల్పడుతోందన్నారు. గతంలో హాస్టళ్లలో దొడ్డు అన్నం పెట్టేవారని, తాము అధికారంలోకి వచ్చాక సన్నబియ్యం, కోడిగుడ్లు అందిస్తున్నామన్నారు. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు పెట్టి పేదలకు కూడా కార్పొరేట్ విద్య అందిస్తున్నామని తెలిపారు.