హరీశ్ కూడా దాడికి దిగారు.. కేంద్రంతో గులాబీ అమీతుమీ - MicTv.in - Telugu News
mictv telugu

హరీశ్ కూడా దాడికి దిగారు.. కేంద్రంతో గులాబీ అమీతుమీ

March 20, 2018

బీజేపీని, మోదీని, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారును ఏకిపారేస్తున్న గులాబీ దళంలోకి మరో పవర్‌ఫుల్ కమాండర్ చేరారు. ప్రయోజనాలు సంఘర్షించినప్పుడు తటస్థంగా ఉండడం సాధ్యం కాదు. కేసీఆర్ బీజేపీని, కాంగ్రెస్‌ను దయ్యబడుతూ థర్డ్ ఫ్రంట్ కూటమికి ఊపిరిపోస్తున్న నేపథ్యంలో ఆయన పరివారం కూడా రంగంలోకి దిగింది. భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

విమర్శల వెనుక..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం హరీశ్ మంగళవారం శాసనమండలిలో నిప్పులు చెరిగారు. చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన ఈ కార్యక్రమానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, తాను ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. అదే సమయంలో మిషన్ కాకతీయతో తాము సాధించిన ఫలితాలను గణాంకాలతో సుదీర్ఘంగా వివరించారు. తద్వారా.. కేంద్రం తెలంగాణకు కోట్ల నిధులు ఇస్తోందని, రాష్ట్ర అభివృద్ధి అంతా తమ చలవేనని చెప్పుకుంటున్న బీజేపీ నేతల  మాటలకు కళ్లెం వేశారు. కేంద్రం సహకరించకున్నా తాము సొంత నిధులతో ఎన్నో పథకాలను పూర్తి చేస్తున్నామని పరోక్షంగా చెప్పకనే చెప్పారు.

హరీశ్ రావు ఆరోపణలు, కాకతీయ ప్రయోజనాల వివరాలు.. పైకి సాధారణంగా కనిపించొచ్చు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంపై ఆయన విమర్శల వెనుక టీఆర్ఎస్ వైఖరి సుస్పష్టంగా కనిపిస్తోంది. ఏన్డీఏ సర్కారుకు అంశాలవారీగా మద్దతు స్థాయి నుంచి.. రిజర్వేషన్ హక్కుపై పార్లమెంటులో ఉధృత పోరాటం, మూడో కూటమి యత్నం.. మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ వరకు సాగుతున్న రాజకీయాలు.. హరీశ్ మాటల్లో మసకతెరల్లా కనిపిస్తున్నాయి.

మంత్రి కేటీఆర్ కూడా కొన్నాళ్లుగా కేంద్రాన్ని దుయ్యబడుతున్న సంగతి తెలిసిందే. ‘అధికారమంతా ఢిల్లీలో కేంద్రీకృతమైంది. అది సరికాదు.. కేసీఆర్ ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్ నిజానికి ఫస్ట్ ఫ్రంట్..’ అని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని అధోగతికి దిగజార్చాయని కేసీఆర్ మూడో ఫ్రంట్ ప్రకటన సందర్భంగా విమర్శించడం తెలిసిందే.

కేంద్రంతో సహకరిస్తుందా?

 

తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు నీళ్లు, నిధులు, నియామకాలు. నియామాకాలను పక్కనబెడితే నీళ్లు, నిధుల విషయంలో కేంద్రం నుంచి సహకారం అవసరం. నిన్నమొన్నటి వరకు అంశాలవారీ మద్దతుతో కేంద్రంతో సఖ్యంగా ఉన్న టీఆర్ఎస్ సర్కారు పలు ప్రాజెక్టులకు అనుమతులను సలభంగా సంపాదించుకుంది. హరీశ్ స్వయంగా ఢిల్లీ వెళ్లి, ఎందరో మంత్రులను కలసి పర్యావరణ అనుమతులను తీసుకొచ్చారు. నీళ్ల కోసం ట్రిబ్యుళ్ల ముందు కొట్టాడారు. అయితే థర్డ్ ఫ్రంట్ కారణంగా సర్కారు వైఖరి మార్చాల్సిన అవసరమేర్పడింది. ఎన్నికలకు గట్టిగా ఏడాదికూడా వ్యవధి లేని నేపథ్యంలో కాళేశ్వరం, కాకతీయ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంది. మనది సమాఖ్య వ్యవస్థ కనుక కేంద్రం ఆ సూత్రానికి కట్టుబడి రాష్ట్రాలకు నిధులను కేటాయించక తప్పుదు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేటాయింపులపై ప్రభావం ఉంటుందా? గులాబీ సర్కారు ఆటుపోట్లను ఎదుర్కొని, కేంద్రంతో తలపడుతూ తన అభివృద్ధియాత్రను నిరాటంకంగా కొనసాగిస్తుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి!