బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్ లో కేంద్ర ప్రభుత్వం వాటా కింద రూ. 1600 ఇస్తోందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. ఈ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిరూపించకపోతే ఆయన ఎంపీ పదవితో పాటు, పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గోబెల్స్ ప్రచారానికి తెరలేపిందని మండిపడ్డారు. ఎన్ని మాటలు చెప్పినా బీజేపీకి ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు.
‘దుబ్బాకలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు. గోబెల్స్‌ను మించి బీజేపీ నేతలు అబద్దాల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. అంత మాత్రాన అడ్డదారుల్లో బీజేపీ నేతలుఅబద్దాలను ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. తిరుగబడ్డ తెలంగాణ అంటూ దుబ్బాకలో తెరాస జెండా గద్దె కూల్చినట్లు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కల్వకుర్తిలో 2018లో ఎన్నికల సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఇలాంటి తప్పుడు ప్రచారానికి ప్రజలు బుద్ది చెప్పాలి. ఇప్పటికే ఈ ప్రచారం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు’ అని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు.