Harish Rao good news for the unemployed..Notifications for another 28 thousand posts
mictv telugu

నిరుద్యోగులకు శుభవార్త..మరో 28వేల పోస్టులకు నోటిఫికేషన్లు: హరీష్ రావు

September 1, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులకు హరీష్ రావు తాజాగా మరో శుభవార్తను చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో టెట్, పోలీసు, గ్రూప్-1, విద్యుత్, వైద్య శాఖల్లో నోటిఫికేషన్లు విడుదల చేశామని, తాజాగా గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు కూడా ఆదేశాలు జారీ చేశామని, రాబోయే వారం రోజుల్లో మరో 28వేల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభించామని అన్నారు.

సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్‌ రావు నేడు స్మార్టుకార్డులను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..”దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2016 పెన్షన్‌ ఇస్తున్నాం. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం రూ.600 మాత్రమే పింఛన్‌ ఇస్తుంది. రాష్ట్రంలో మొత్తం 40 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నాం. ఎవరూలేని వారికి పింఛను, బియ్యం భరోసా ఇస్తున్నాం. తెలంగాణవ్యాప్తంగా వివిధ వర్గాల వారికి పింఛన్లు ఇచ్చి కేసీఆర్‌ అండగా ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తుంది” అని ఆయన అన్నారు.

అనంతరం పేద ప్రజల కోసం కేసీఆర్‌ ఇప్పటికే పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చి, అమలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. తాజాగా ప్రభుత్వం.. సొంత జాగాలో ఇండ్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దసరా పండుగ రోజున ప్రారంభించడానికి సిద్దమైందని పేర్కొన్నారు. ఇక, నిరుద్యోగుల విషయానికొస్తే.. మరో రెండు, మూడు రోజుల్లో గ్రూప్‌- 4 నోటిఫికేషన్‌ వస్తుందని తెలిపారు. అంతేకాదు, రాబోయే వారం రోజుల్లో 28 వేల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభించామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.