హరీశ్ అభివృద్ధి తంత్రం.. ఆయన ఊరికి చంద్రబాబు ఊరోళ్లు ఫిదా..   - MicTv.in - Telugu News
mictv telugu

హరీశ్ అభివృద్ధి తంత్రం.. ఆయన ఊరికి చంద్రబాబు ఊరోళ్లు ఫిదా..  

November 29, 2017

ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. తనకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లవంటివి అంటూనే విభజనకు ఆయన మోకాలడ్డారు. అదే చంద్రబాబు సొంత నియోజకవర్గం ఏలుబడిలోని జనం ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని చూసి ముచ్చటపడుతున్నట్లు  ఉదంతం తెలుపుతోంది. ఇదంతా తెలంగాణ మంత్రి హరీశ్ రావు అభివృద్ధి మంత్ర ఫలితం.

హరీశ్ దత్తత తీసుకున్న సిద్ధపేటలోని ఇబ్రహీంపూర్ గ్రామం చాలా అంశాల్లో అభివృద్ధి చెందింది. తొలి నగదు రహిత గ్రామంగా పేరొందింది. అక్కడ ప్రజాసంక్షేమం, అభివృద్ధి ఎలా సాధ్యమైందో తెలుసుకోవడానికి చంద్రబాబు నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం ప్రజాప్రతినిధులు వచ్చారు. మంగళవారం సాయంత్రం రామకుప్పం మండలం విజులాపురం గ్రామ ప్రజలు హరీశ్ దత్తత గ్రామానికి చేరుకున్నారు. దేశ ,రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ ఆదర్శ గ్రామం విశేషాలు తెలుసుకుని సంతోషించారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి తమ గ్రామానికి రావడంపై ఇబ్రహీంపూర్ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్రహీంపూర్ గ్రామం దోమల్లేని పల్లె. వంద శాతం ఇంకుడు గుంతలు,  భూగర్భ జాలాలు, జలసంరక్షణ కందకాలు, హరితహారం తదితర వినూత్న కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2.50 లక్షలు మొక్కలు నాటారు. గ్రామంలో 10 స్వైపింగ్ మిషన్ల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు.పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నారు.