Harish Rao is sweet to the doctors.. 56 months PRC soon..
mictv telugu

డాక్టర్లకు హరీష్ రావు తీపికబురు..త్వరలోనే 56 నెలల పీఆర్సీ..

August 31, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు వినాయక చవితి సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఓ శుభవార్తను చెప్పారు. త్వరలోనే ప్రభుత్వ వైద్యులకు సంబంధించిన, 56 నెలల పీఆర్‌సీ, ఎరియర్స్‌ను ఒకేసారి కాకుండా విడుతల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం వైద్యుల దీర్ఘకాలిక సమస్యలపై..గాంధీ ఆసుపత్రి టీజీజీడీఏ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ రాజేశ్వరరావు హరీష్ రావును కలిశారు. ఈ క్రమంలో పీఆర్‌సీ, ఎరియర్స్‌పై, వైద్యుల దీర్ఘకాలిక సమస్యలపై వివరించారు.

దాంతో హరీష్ రావు సానుకూలంగా స్పందిస్తూ..”ప్రభుత్వ వైద్యులకు సంబంధించిన, 56 నెలల పీఆర్‌సీ, ఎరియర్స్‌ను ఒకేసారి కాకుండా విడుతల వారీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీనిపై త్వరలోనే జరగబోయే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. అలాగే, ప్రభుత్వ వైద్యులు కోరినట్టుగానే 15 రోజులు ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్, ట్రావెలింగ్ అలవెన్లపై పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా డీఎంఈ రమేశ్ రెడ్డిని కోరినం” అని ఆయన అన్నారు.

అనంతరం టీజీజీడీఏనేత పల్లం ప్రవీణ్, గాంధీ యూనిట్ అధ్య క్షుడు డాక్టర్ రాజేశ్వర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. త్వరగా వీటికి సంబంధించిన జీవోలను విడుదల చేయాలని కోరారు. ఆరోగ్య తెలంగాణ సాధనలో తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఉస్మానియా హాస్పిటల్ టీజీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ రంగా, కార్యదర్శి శంకర్‌సింగ్, గాంధీ టీజీజీడీఏ ప్రధాన కార్యదర్శి భూపిందర్ రాథోడ్, సభ్యులు రవి, బన్సీ లాల్, కృష్ణనాయక్, వినోద్, సంజీవ, శంక రానాయక్ తదితరులు ఉన్నారు.