హరీశ్‌ను ఆకాశానికెత్తేసిన కేసీఆర్.. ఎందుకంటే? - MicTv.in - Telugu News
mictv telugu

హరీశ్‌ను ఆకాశానికెత్తేసిన కేసీఆర్.. ఎందుకంటే?

December 9, 2017

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు.  ఆయనపై రాష్ట్ర ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని కొనియాడారు. శనివారం ప్రగతి భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సీఎం సమీక్షిస్తూ.. హరీశ్ రావును ఆకాశానికి ఎత్తేశారు.

“తెలంగాణ రాష్ట్ర ప్రజలు హరీశ్‌పై కోటి ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తారని తమకు నీళ్లు ఇస్తారని హరీశ్‌పై ఎంతో ఆశలు నమ్మకంతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన ఎంతో చురుగ్గా పని చేస్తున్నారు. మహారాష్ట్ర తో ఒప్పందం విషయంలో బాగా పని చేశారు. కాళేశ్వరం సీ .ఈ.ఎన్. వెంకటేశ్వర్లు కూడా మహారాష్ట్ర ఆధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. ప్రాజెక్టులు  పూర్తి కావడానికి కూడా ఇదే పట్టుదలతో పని చేయాలి.

ఇకపై హరీశ్ 10 రోజులకు ఒకసారి  కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్శించాలి. నెలకోసారి నేను, సీ.ఎస్ కూడా కాళేశ్వరం పనులు స్వయంగా చూస్తాం. మేడి గడ్డ నుంచి మిడ్ మానేరు వరకు నీళ్లు తీసుకురావడం చాలా ముఖ్యం. ఈ పనులు చేయడానికి ఇప్పటికి 200 రోజుల గడవు ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పనులు సత్వరం పూర్తి చేయాలి’ అని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పర్యవరణ అనుమతులు వచ్చాయని సీఎం తెలిపారు.  దీనిపై కోర్టులో సమర్పించిన అఫడవిట్‌‌కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించామని, మరో రూ. 20 వేల కోట్లు బ్యాంకుల నుంచి తెచ్చుకుంటామని తెలిపారు.  సమీక్ష సమావేశంలో హరీశ్ రావు, పెద్దపల్లి, భూపాలపల్లి కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. సీఎం.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రెండు రోజులు స్వయంగా పరిశీలించడం తెలిసిందే.