దళితులపై దాడులు.. మోదీ చొరవ తీసుకోవాలి.. హరీశ్ - MicTv.in - Telugu News
mictv telugu

 దళితులపై దాడులు.. మోదీ చొరవ తీసుకోవాలి.. హరీశ్

April 3, 2018

‘దళితుల బాధను లోతుగా అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఏటా 40వేలకు పైగా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదవుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకుని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించాలి’ అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. దళితుల భారత్ బంద్, తదితర పరిణామాలపై ఆయన మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చే పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ఆలోచించాలన్నారు.

దాడులకు గురవుతున్న దళితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయి. దీంతో కేసులూ పెరుగుతున్నాయి. బాధితుల ఆందోళనను లోతుగా అర్థం చేసుకోవాలి. ప్రధాని స్పందించాలి. సుప్రీం కోర్టు తీర్పుపై  రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలి’ అని సూచించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. ‘రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్ తదితర రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ. ఇవన్నీ భాజపా పాలిత రాష్ట్రాలే. దేశంలో గుణాత్మక మార్పు వస్తేనే బడుగు వర్గాల కష్టాలు తీరుతాయి. కాంగ్రెస్‌, బీజేపీలు వాటి పాలనలో ఏం చేశాయో ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయంగా పైచేయి సాధించాలనే ధోరణి సరికాదు’ అని అన్నారు.