తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, హోం మంత్రి మహమూద్ అలీ, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌లు కోఠీలోని ఈఎన్టీ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్బంగా సరదా సంఘటన చోటచేసుకుంది. హరీష్ రావు రోగులను పలకరిస్తూ ‘వైద్య సేవలు ఎలా ఉన్నాయి? మందులు ఇక్కడే ఇస్తున్నారా? అని ఓ రోగి తల్లిని అడిగారు. దానికామె సేవలు బాగున్నాయని, మందులు ఇక్కడే ఇస్తున్నారని బదులిచ్చింది. హరీష్ మళ్లీ పక్కానా? అని ప్రశ్నించగా, పక్కా అని సమాధానమిచ్చింది.
దాంతో పక్కనే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వైపు తిరిగిన హరీష్ రావు ‘ఈయనకు మీరైనా చెప్పండమ్మా..మమ్మల్ని ఊరికే తిడుతుంటడు’ అంటూ ‘జర సునోజీ’అని రాజా సింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తర్వాత రాజాసింగును చూస్తూ ‘ఆమె ఏం చెప్పిందో విన్నారు కదా. ఆమె చెప్పినట్టుగా మీరు అసెంబ్లీలో చెప్పాలి, చెప్తారు కదా’ అని చమత్కరించడంతో రాజాసింగుతో సహా అక్కడున్న వారందరూ నవ్వారు.