మీరు బాధపడితే నేను తట్టుకోలేను : హరీష్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

మీరు బాధపడితే నేను తట్టుకోలేను : హరీష్ రావు

October 28, 2019

కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి మంత్రి హరీష్ రావు. ఎంత బీజీగా ఉన్నా నియోజకవర్గ ప్రజలను పలకరిస్తూనే ఉంటారు. ఎవరు ఏ సాయం కోరి వచ్చినా కాదనకుండా చేస్తారు. అందుకే ఆయనను ఆ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే ఇటీవల ఆయనను కలవడానికి హైదరాబాద్ వస్తున్న పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలకు ఆయన ఓ విన్నపం చేశారు. తనను కలవాలంటే సిద్ధిపేటకు మాత్రమే రావాలని హైదరాబాద్ వరకు రావద్దని సూచించారు. దీనికి సంబంధించిన వీడియోను టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

మంత్రిగా బిజీగా హైదరాబాద్‌లో ఉన్న సమయంలో నియోజకవర్గ ప్రజలు వస్తున్నారు. దీని వల్ల వారి రానుపోను ఖర్చులు, కొన్నిసార్లు వారి పనులు పూర్తి చేయలేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి ఓ విన్నపం చేశారు. ‘ఏదైనా సమస్య ఉంటే సిద్దిపేట లోనే నన్ను కలవండి. వారంలో నాలుగు రోజులు అక్కడే ఉంటా. డబ్బులు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ వరకు రావద్దు. పని కాకపోతే మీ మనస్సు నొచ్చుకుంటుంది. నేను కూడా బాధ పడతాను. అత్యవసరం, ఆసుపత్రి పనులు అయితేనే హైదరాబాద్ వరకు రావాలి’ అంటూ కోరారు. హరీష్ చూపిన చొరవపై నెటిజన్లు, ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.