నేను నిద్రపోను..మిమ్ముల్ని నిద్రపోనివ్వను..! - MicTv.in - Telugu News
mictv telugu

నేను నిద్రపోను..మిమ్ముల్ని నిద్రపోనివ్వను..!

May 13, 2017

మూడు రోజులు..250 కిలోమీటర్లు…కాలువల గట్లపై నడక…అర్ధరాత్రి దాకా అధికారులతో చర్చలు.. పల్లెల్లో నిద్ర..ప్రాజెక్టులపై ఉడుంపట్టు..పెండింగ్ పనులు పూర్తయ్యేదాకా పట్టువదలని విక్రమార్కుడు..ఆయనే తెలంగాణ ఇరిగేషన్ మినిష్టర్ హరీష్ రావు…మూడేళ్లలో ఇప్పటిదాకా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 సార్లు పర్యటించిన ఆయన..ప్రాజెక్టుల పూర్తిపై నజర్ పెట్టారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ హయాంలో శిలఫలకాలు..కాంగ్రెస్ హయాంలో కాలువలు తవ్వి తవ్వకుండానే వదిలేశారు. ఆ తర్వాత ప్రాజెక్టుల పనులు అడుగుముందుకు కదల్లేదు..పొలాల్లో ముళ్లకంపులు మొలిచాయి. పాలమూరు జిల్లాలో ఎప్పుటికీ ప్రాజెక్టులు పూర్తికావు. ఇక ఇంతే అనుకున్న సమయంలో తెలంగాణ సర్కార్ కెరటంలా దూసుకొచ్చింది. అందునా ఇరిగేషన్ మినిష్టర్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రాజెక్టులపై నజర్ పెట్టారు. అంతే చకచకా పనులు మొదలయ్యాయి. పెండింగ్ ప్రాజెక్టుల్లో పనులు ముమ్మరమయ్యాయి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శరవేగంగా పూర్తయ్యాయి.కాలువల్లోకి నీళ్లు మళ్లాయి. ఈ కాలువల ద్వారా చెరువుల్ని నింపారు. నాగర్ కర్నూల్ జిల్లాలో బీడువారిన పొలాలు పచ్చని కళని సంతరించుకున్నాయి. రైతున్నల కళ్లలో జలసిరులు కనిపించాయి. వీటింతటికి కారణం ఒక్కే ఒక్కడి పట్టుదల..మంత్రి హరీషే కారణం. ప్రాజెక్టుల పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ దగ్గరుండి అధికారులతో పనులు చేయించారు. రేయింబవళ్లు పనిచేయిస్తూ ప్రాజెక్టుల దగ్గర బస చేశారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం నుంచి మూడ్రోజులుగా పర్యటించారు. నాలుగు ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేశారు. ఉదయం దినచర్య ముగించుకొని ప్రాజెక్టుల పర్యటన ప్రారంభించారంటే రాత్రి ఒంటిగంట వరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటిరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి జడ్చర్ల నియోజకవర్గంలోని రెడ్డిగూడ ప్రాజెక్టును సందర్శించి రాత్రి అక్కడే బస చేశారు. మరుసటి రోజు డిండి ఎత్తిపోతల ప్యాక్-29పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగర్‌కర్నూల్ కలెక్టర్ శ్రీధర్‌తో కలిసి గుడిపల్లి దగ్గర రిజర్వాయర్ పనులపై సుమారు 4 గంటలపైగా సమీక్ష నిర్వహించారు.

ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు దగ్గర 70 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలను అధికారులతో కలిసి రూపొందించారు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్యాక్ ద్వారా 90 వేల ఎకరాలకు నీరు అందించేందుకు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆతర్వాత భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను సందర్శించారు. ఆ తర్వాత అలంపూర్ దగ్గర ఒంటిగంట వరకు గడిపారు. శుక్రవారం నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల దగ్గర ప్యాకేజీ-46 ద్వారా ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించగలుగుతామని అధికారులతో ఆయన సమీక్ష జరిపారు.
వచ్చే వానకాలం పంట నాటికి పాలమూరు జిల్లాలో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని హరీశ్‌రావు అన్నారు.ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తయితే పాలమూరు మరో కోనసీమగా మారనుందన్నారు. వలసల జిల్లాగా పేరొందిన పాలమూరుకే వలసలు వచ్చే రోజులు రానున్నాయన్నారు. ఎవరెన్ని అడ్డంకుల సృష్టించినా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పర్యటించడం పై ప్రధానంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఆనందోత్సాహాల్లో ఉన్నాయి. తమ ప్రాంతానికి సాగునీరు తప్పకుండా వస్తుందన్న భరోసాలో ఉన్నాయి. మక్తల్ పర్యటన నుంచి తిరిగి వస్తుండగా దారిలో ఓ గొర్రెల కాపరితో మంత్రి హరీష్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ గొర్రెల కాపరి మంత్రితో మాట్లాడుతూ గతంలో కర్ణాటక, తదితర ప్రాంతాలకు గొర్రెల మేతల కోసం వలసలు వెళ్లేవాళ్లం. ఇప్పుడు మన కాడ్నే నీళ్లొచ్చినయ్.. ఇక్కడే మేపుకుంటున్నాం. ఇంటి పట్టున ఉంటున్నాం.. అని చెప్పడంతో మంత్రి సంతోషించారు. ఇంకా మీ మేలు కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని హరీష్ రావు చెప్పారు.