హైదరాబాద్‌పై హరీశ్ నజర్.. ఏందా కథ? - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌పై హరీశ్ నజర్.. ఏందా కథ?

February 16, 2018

భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు.. అంటే సాగునీటి ప్రాజెక్టులో కళ్లముందు కదలాడతాయి. మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు పనుల సమీక్ష, వాటికి కేంద్రం నుంచి వివిధ అనుమతుల కోసం ఆయన చేసే ఢిల్లీ పర్యటనలు, రైతుల సమస్యలపై ప్రకటనలు, మార్కెటింగ్ శాఖ వ్యవహారాలు గుర్తుకొస్తాయి. మొత్తానికి ఆయన గ్రామసీమల్లో తిరిగే మంత్రి అని నానుడి. మరోపక్క ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో కలియ రుగుతూ ఉంటాయి. దీంతో హరీశ్ రూరల్, కేటీఆర్ అర్బర్ అనే బ్రాండ్ పడిపోయింది. అలాంటి హరీశ్ శుక్రవారం హైదరాబాద్‌లో సుడిగాలిగా పర్యటించారు.

 

తాను కేవలం గ్రామీణ సమస్యలపైనే కాకుండా, అన్ని ప్రజాసమస్యలపైనా స్పందించి, తను చేయగలింది చేయగలనని చెప్పడానికి ఆయన షహర్ బాట పట్టినట్లు కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకంగా ప్రధాని మోదీ సమక్షంలో ప్రారంభమైన మెట్రో రైల్ ప్రారంభానికిగాని, ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు(జీఈఎస్)కుగాని హరీశ్ హాజరుకాని సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల కోసం కసర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టులు ఒక కొలిక్కి వస్తుండడంతో బస్తీ సమస్యలపై దృష్టి సారించారు.

హరీశ్ శుక్రవారం సనత్ నగర్ నియజకవర్గంలోని శ్యామల కుంట బస్తీలో తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసరావుకూడా ఆయన వెంట ఉన్నారు. పర్యటన సందర్భంగా హరీష్ మాట్లాడుతూ..‘డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించాలనే ఇక్కడకి వచ్చాం.. గతంలో కాంగ్రెస్ వాళ్లు పక్కన కొన్ని ఇళ్లు కట్టించి మిమ్మల్ని అక్కడకు పంపి ఈ భూమినంతా కబ్జా చేద్దామనుకున్నారు. కానీ వారిని కాళ్ళు విరగగొట్టి పంపించారు. పక్కన అద్భుతమైన కాలనీలు ఉన్నాయి. ఇక్కడ పక్కగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తాం. అయితే కోర్టులో కేసుల వల్ల సమస్య ఉంది. రెండు మూడు రోజుల్లో చర్చలు జరిపి సమస్య పరిష్కరిస్తాం.. ’’ అని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం లెక్కలేనన్ని పథకాలు అమలు చేస్తున్నాని ఆయన కొనియాడారు.