షరతుల పొత్తా? సిగ్గులేని పొత్తా?.. హరీశ్ 12 ప్రశ్నలు - MicTv.in - Telugu News
mictv telugu

షరతుల పొత్తా? సిగ్గులేని పొత్తా?.. హరీశ్ 12 ప్రశ్నలు

October 9, 2018

విపక్షాల మహాకూటమి ఏర్పాటుపై టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ తీవ్ర విమర్శలు సంధించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి 12 ప్రశ్నలతో బహిరంగ లేఖాస్త్రాన్ని సంధించారు.  తెలంగాణకు అన్యాయం చేసిన టీడీపీతో పొత్తు వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, వాటిని నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. మహాకూటమి కొందరు నేతల వ్యక్తిగత స్వార్థమే తప్ప …తెలంగాణ ప్రయోజనాల కోసం కాదని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం పోరాడింది కేసీఆరేనని, ఆయన పదకొండు రోజుల దీక్షతో చావు నోటి దాకా వెళ్లారని గుర్తు చేశారు. కేసీఆర్ చిత్తశుద్ధి అలాంటిదని, ఇప్పుడు మహాకూటమి నేతలు మాత్రం పరాయి పాలన కోసం ఆశిస్తున్నారని విమర్శించారు.  కోదండరాం తెలంగాణ వ్యతిరేకులతో కలవడం అమరవీరుల ఆత్మలకు ద్రోహం చేయడమేనన్నారు. హరీశ్ ఈరోజు టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

TRS leader, irrigation minister Harish Rao raised questions Uttam Kumar Reddy on TDP-Congress alliance pointing out various issues related to water bifurcation employees etc

హరీశ్ వేసిన ప్రశ్నలు ఇవీ

‘మీది షరతులతో కూడిన పొత్తా? సిగ్గులేని పొత్తా? గతంలో టీఆర్ఎస్.. కాంగ్రెస్, టీడీపీలతో షరతులతో కూడిన పొత్తు పెట్టుకుంది. మరి పొత్తు ఎలాంటిది? చంద్రబాబు చివరి దాకా తెలంగాణను అడ్డుకున్నారు..అతడు ఎప్పటికే ఆంధ్ర బాబే.. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కూడా వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. మరిప్పుడు ఆ వైఖరి మార్చుకున్నారా? టీడీపీ పొలిట్ బ్యూరోలో తీర్మానం చేశారా?  తెలంగాణ వ్యతిరేక వైఖరి వీడానని బాబు హామీ ఇచ్చారా? పోలవరం ఏడు మండలాలు తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారా? పోలవరం డిజైన్ మారుస్తామని హామీ ఇచ్చారా?

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వద్దని బాబు కేంద్రానికి 30 లేఖలు రాశారు. బాబు వైఖరి మార్చుకుని మళ్ళీ కేంద్రానికి లేఖ ఇచ్చారా? కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి ఇచ్చిన లేఖను వాపసు తీసుకున్నారా? కృష్ణా, గోదావరి జలాల్లో వాటాకు సంబంధించి ట్రిబ్యునళ్లలో జరుగుతున్న వాదనల విషయంలో వైఖరి మార్చుకుంటున్నారా?  తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల కృష్ణా జలాలను రాకుండా ఆయన అడ్డుకుంటున్నారు. ఏపీపై మేం పోరాడుతున్నాం. తెలంగాణకు నీళ్లు వద్దంటున్న బాబుతో నీళ్లు ఇప్పిస్తామని చెప్పించగలరా?

చంద్రబాబు తెలుగు జాతి అని మాట్లాడుతుంటారు. అది ఆయనకు అతకదు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. మిషన్ భగీరథ ద్వారా అందరికీ నీళ్లిచ్చే ప్రాజెక్టును బాబు వ్యతిరేకిస్తున్నారు. దానిపై ఆయన వైఖరి మారిందా? కేంద్రంలోని బీజేపీ మద్దతుతో 460 మెగావాట్ల సీలేరు హైడల్ విద్యుత్ కేంద్రాన్ని బాబు లాక్కున్నారు. దాన్ని తెలంగాణకు బాబుతో తిరిగి ఇప్పిస్తారా?

త్రిశంకు స్వర్గంలో ఉన్న 1350 మంది ఉద్యోగులను ఏపీ తీసుకోవడానికి బాబును ఒప్పిస్తున్నారా?  నిజాం వారసత్వంగా తెలంగాణకు రావాల్సిన ఆస్తులపై బాబు వాదన ఏమైనా మార్చుకున్నారా? హైకోర్టు, మిగతా విభజన హామీలపై బాబుతో హామీ తీసుకున్నారా?  మహాకూటమి కనీస ఉమ్మడి ప్రణాళికలో చంద్రబాబుతో ఈ పన్నెండు అంశాలపై సంతకం పెట్టిస్తారా?’ అని  మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.