దిగుబడి అంచనాలతో గోడౌన్ల వసతి పై అధ్యయనం
రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాలు, ఆయకట్టు,పంటలు, వాటి దిగుబడి అంచనాలతో గోడౌన్ల వసతి గురించి శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఇరిగేషన్, వ్యవసాయ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖలతో సమన్వయం చేసుకొని ఈ అధ్యయనం జరగాలని, ఇందుకు గాను ఒక ఏజెన్సీ ని నియమించుకోవాలని అన్నారు. హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో టి.ఎస్.వేర్ హౌజింగ్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ సంస్థ ల ఆధ్వర్యంలో ఉన్న గోడౌన్ల సామర్ధ్యం, ఇంకా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కావలసిన గోదాముల సామర్ధ్యాన్ని పెంచాలని హరీష్ సూచించారు.
గత ఆర్ధిక సంవత్సరం లో 20.89 కోట్లు నికర లాభాన్ని ఆర్జించించిన గిడ్డంగుల సంస్థ పని తీరును మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్ ను,ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.గడచిన మూడేళ్ళలో గిడ్డంగుల ఆక్యుపెన్సీ ని ఆయన సమీక్షించారు. మొట్ట మొదటి సారి ఈ ఏడాది గిడ్డంగుల సంస్థ కు చెందిన గిడ్డంగుల లో 100 శాతం ఆక్యుపెన్సీ సాధించడం పట్ల మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు.