కేసీఆర్‌కు వచ్చే ప్రశ్నలకు హరీశ్‌ జవాబులు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌కు వచ్చే ప్రశ్నలకు హరీశ్‌ జవాబులు

September 11, 2019

Harishrao.

ఆర్థికశాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన హరీశ్ రావుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక బాధ్యతను అప్పగించారు. తన దగ్గరే ఉన్న కీలకమైన సాగునీటి పారుదల వ్యవహారాలకు సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను హరీశ్ రావుకు అప్పగించారు. సాగునీటి పారుదల శాఖతో పాటు శాంతి భద్రతలు, సాధారణ పరిపాలనకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే బాధ్యతలను హరీశ్ రావుకే అప్పగించారు సీఎం కేసీఆర్.

ఇప్పటికీ తన దగ్గరే ఉన్న పలు శాఖలకు సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతలను పలువురు మంత్రులకు అప్పగించే క్రమంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో సాగునీటి వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరించి కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో హరీశ్ రావు కీలకంగా వ్యవహరించారు. అయితే కేసీఆర్ మరోసారి హరీశ్‌కు అదే శాఖ అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా సాగునీటి శాఖను తనవద్దే వుంచుకుని, హరీశ్‌కు ఆర్థికశాఖను అప్పగించారు. ఈ క్రమంలో సాగునీటి వ్యవహారాల అంశంలో హరీశ్ రావుకు గత అనుభవం వున్నందున ఆ శాఖకు సంబంధించిన సమాధానాలు చెప్పే బాధ్యతలను అప్పగించారు. 

అయితే తన దగ్గర ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే బాధ్యతలను పలువురు మంత్రులకు అప్పగించిన కేసీఆర్… రెవెన్యూ శాఖకు సంబంధించిన బాధ్యతను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, గనులు, సమాచార, పౌర సంబంధాల శాఖలకు సంబంధించిన బాధ్యతలను మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు.