ఆ హార్లే డేవిడ్సన్‌ బైక్ లు నడపొద్దు..ఉంటే వెనక్కి ఇచ్చేయాల్సిందే..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆ హార్లే డేవిడ్సన్‌ బైక్ లు నడపొద్దు..ఉంటే వెనక్కి ఇచ్చేయాల్సిందే..!

June 3, 2017

హార్లే డేవిడ్సన్‌ బైక్ లంటే అదో క్రేజీ.తిరిగితే వాటిపై తిరగాలనేది కొంతమంది యూత్ ఫ్యాషన్. అందుకే వీటిని ఎక్కువగా కొంటారు. కానీ గతేడాది జూలై తర్వాత ఆ బైక్ కొన్నారా.. అయితే వెంటనే వెనక్కి ఇచ్చేయండి..లేదంటే…

ప్రపంచ ప్రఖ్యాత మోటార్‌ సైకిళ్ల ఉత్సత్తిదారు హార్లే డేవిడ్సస్‌…ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడైపోయిన పలు మోడళ్ల ఇంజన్లలో లోపాలున్నట్లు ప్రకటించింది. ఆ లోపం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున, 60 వేల మోటార్‌సైకిళ్లను రీకాల్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. విస్కాన్సిస్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయం ఈ మేరకు తన డీలర్లు, కస్టమర్లకు సమాచారం అందించింది. మంగళవారం నుంచి బైక్‌లు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది.
లోపాలు ఇవే…
ఇంజిన్‌ ఆయిల్‌ కూలర్‌లైన్ల క్లాంపులు సరిగా బిగించకపోవడంతో ఆయిల్‌ లీక్‌ అవుతోందని, తద్వారా వెనుక చక్రం పట్టుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హార్లే సంస్థ చెబుతోంది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు తొమ్మిది ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, ఒక బైకర్‌ గాయపడ్డాడని తెలిపింది. నిజానికి ఫిర్యాదులేవీ రానప్పటికీ, వినియోగదారుల క్షేమం దృష్ట్యా బైక్‌లను రీకాల్‌ చేశామన్న హర్లే.. ఆయా షోరూమ్‌లలో క్లాంపులను సరిగా బిగించి ఇస్తామంటోంది. దీనికి ఎలాంటి చార్జీ వసూలు చేయబోమని చెబుతోంది.
9 మోడళ్లలో లోపాలు..
2016 జులై 2 నుంచి 2017 మే 9 వరకు తయారుచేసిన తొమ్మిది మోడళ్లలో ఆయిల్‌ లీకేజీ లోపం ఉన్నట్లు హార్లే డేవిడ్సన్‌ తెలిపింది.
ఆ మోడళ్లు ఇవే.. 1.ఎలక్ట్రా గ్లైడ్‌ ఆల్ట్రా క్లాసిక్‌, 2.పోలీస్‌ ఎలక్ట్రా గ్లైడ్‌, 3.పొలీస్‌ రోడ్‌ కింగ్, 4.రోడ్‌ కింగ్‌, 5.రోడ్‌ కింగ్‌ స్పెషల్‌, 6.స్ట్రీట్‌ గ్లైడ్‌, 7.స్ట్రీట్‌ గ్లైడ్‌ స్పెషల్‌, 8.రోడ్‌ గ్లైడ్‌, 9.రోడ్‌ గ్లైడ్‌ స్పెషల్‌. ఈ మోడళ్లను కొనుగోలు చేసిన కస్టమర్లు మంగళవారం నుంచి సమీపంలోని షోరూమ్‌లకు వెళ్లాలి.