Harpreet left her husband Mithun after getting a job in Bihar
mictv telugu

ఇంత స్వార్థమా? ఉద్యోగం వచ్చాక భర్తకు బైబై చెప్పేసింది

July 22, 2022

ఉద్యోగాల కోసం ప్రిపేరవుతూ ఒకే దగ్గర కోచింగ్ తీసుకున్న యువతీ యువకులు ప్రేమలో పడడం సహజం. తర్వాత వారికి ఉద్యోగాలు రాగానే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి పెద్దలు కూడా అభ్యంతర పెట్టరు. ఈ సన్నివేశాలు హైదరాబాదులోని అశోక్ నగర్ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ, బీహార్‌లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. కాకపోతే దంపతుల్లో భార్యకు ఉద్యోగం రాగా, తర్వాత ఆమె చేసిన పనికి భర్త షాకయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఆంగ్ల మీడియా కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సమస్తిపూర్ జిల్లాకు చెందిన మిథున్ కుమార్ చదువు పూర్తి చేసుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తనలాగే ప్రిపేరవుతున్న హర్‌ప్రీత్ అనే యువతి పరిచయమైంది.

తర్వాత ప్రేమగా మారడంతో ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉంటూ చదువుకుంటున్నారు. పరీక్షలు అయిపోయాక ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి గతేడాది వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. పరీక్ష ఇద్దరూ రాయగా, ఉద్యోగం మాత్రం భార్యకు వచ్చింది. మిథున్ కుమార్‌కు నిరాశే మిగిలింది. అయితే ఏంటి? భార్యకు ఉద్యోగం వచ్చింది కదా.. అని సర్దుకుపోయాడు. ఇలా వారి సంసారం కొంతకాలం సజావుగా సాగింది. అయితే రానురాను భార్య హర్‌ప్రీత్‌లో మార్పు రావడం మిథున్ కుమార్ గమనించాడు. ఓ రోజు ఆమె వైఖరిపై సూటిగా నిలదీశాడు. దాంతో హర్ ప్రీత్ తన మనసులోని విషయాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పేసింది. నువ్వంటే ఇష్టం లేదు. నీతో కలిసి బతకలేను అని పిడుగులాంటి వార్త చెప్పింది. దీంతో ఖంగుతిన్న మిథున్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యను కాపురానికైనా రప్పించాలి లేదా తాను ఖర్చు పెట్టిన రూ. 15 లక్షలనైనా ఇప్పించాలని వారిని కోరాడు. అటు హర్ ప్రీత్ మిథున్ ఆరోపణలను ఖండించింది. తన భర్తకు వేరే యువతితో అక్రమ సంబంధం ఉందని, విడాకులివ్వాలంటే రూ. 25 లక్షలు డిమాండ్ చేశాడని, లేకపోతే చంపేస్తానంటూ బెదిరించాడని ప్రత్యారోపణ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పించే పనిలో పడ్డారు. అటు ఇద్దరి మాటల్లో ఎవరి వెర్షన్ నిజం అనే దానిపై విచారణ చేస్తున్నారు.