‘హ్యారీ పోటర్’ రచయిత్రి ఔదార్యం.. 134కోట్ల విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

‘హ్యారీ పోటర్’ రచయిత్రి ఔదార్యం.. 134కోట్ల విరాళం

September 13, 2019

Harry potter creator J.K. Rowling Donates $18.9 Million to MS Research

ప్రపంచ ప్రఖ్యాత ఇంగ్లీష్ నవల రచయిత్రి, హ్యారి పోటర్ సృష్టికర్త జేకే రౌలింగ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. తన ఆస్తిలో చాలావరకూ దాతృత్వానికే ఖర్చు చేయడం ఆమెకు అలవాటు. తాజాగా మల్టిపుల్ స్కెలెరోసిస్ (ఎంఎస్) వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న ఆనా రౌలింగ్ రీజనరేటివ్ న్యూరాలజీ కేంద్రానికి ఏకంగా రూ.134.39 కోట్ల విరాళం అందించారు. 2010లోనూ రౌలింగ్ ఈ కేంద్రానికి రూ.87.88 కోట్ల సాయం అందించారు. 

యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్‌లో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. 2007లో తన తల్లి ఆనా రౌలింగ్ పేరుతో ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఎంఎస్ వ్యాధి సోకినవారి వెన్నెముక, మెదడు, కళ్లు, ముఖ్యంగా నాడీకణాలు దెబ్బతింటాయి. దీనివల్ల చూపు కోల్పోయి, కండరాల పటుత్వం కోల్పోయి రోజువారీ పనులు చేసుకోలేని స్థితికి చేరుకుంటారు. జేకే రౌలింగ్ తల్లి ఆనా రౌలింగ్ ఈ వ్యాధితో 45 ఏళ్లకే కన్నుమూశారు. దీంతో ఈ వ్యాధిపై జరుగుతున్న పరిశోధనలకు ఆమె విరాళాలు అందిస్తున్నారు. రౌలింగ్ రూ.134 కోట్లు అందించడంపై యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ పరిశోధన సెంటర్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ చంద్రన్ మాట్లాడుతూ..ఈ కేంద్రంలో ఎంఎస్ వ్యాధితో పాటు పార్కిన్ సన్, న్యూరాన్ మోటార్ డిజార్డర్ వంటి వ్యాధులకు కూడా చికిత్స అందజేస్తున్నామని తెలిపారు.