హర్యానాలో దారుణం జరిగింది. అక్రమ మైనింగ్ ను అడ్డుకోబోయిన డీఎస్పీ అధికారిని లారీలో తొక్కించి చంపేసింది మైనింగ్ మాఫియా. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మంగళవారం హర్యానా నుహ్ లో రాళ్ల అక్రమ మైనింగ్ జరుగుతుందనే సమాచారంతో డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ తన టీంతో కలిసి ఆరావళి పర్వత శ్రేణి సమీపంలోని పచ్గావ్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ ఆపేందుకు ఉదయం 11 గంటలకు ఘటన స్థలానికి వెళ్లారు. అయితే పోలీసులు రావడాన్ని గుర్తించిన మైనింగ్ మాఫియా అక్కడి నుంచి పారిపోయారు.
అయితే ఇదే సమయంలో అక్కడ నుంచి లారీతో పాటు పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించగా.. వారిని ఆపేందుకు డీఎస్పీ లారీకి అడ్డుగా నిలబడ్డారు. అయితే ఈ క్రమంలో లారీ ఆపకపోగా.. డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ పై నుంచి పోనిచ్చారు. దీంతో ఆయన అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు పోలీసులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. లారీతో ఢీ కొట్టిన తరువాత నిందితుడు ఘటన స్థలం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. మరణించిన డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ కి హర్యానా పోలీసులు సంతాపాన్ని తెలియజేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.