సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా బదీలల పర్వం కొనసాగుతోంది. మరోసారి ఆయనను హర్యానా ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో 30 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అయన 56 వ సారి బదిలీ అయ్యారు. ప్రస్తుతం హరియాణా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న అశోక్ ఖేమ్కాను అదే హోదాతో ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది ప్రభుత్వం.
ఇటీవల హర్యానా చీఫ్ సెక్రటరీ సర్వేష్ కౌశల్‌కు.. అశోక్ ఖేమ్కా ఓ లేఖ రాశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పనిభారం “వారానికి 2-3 గంటల ఉంటుందని..తనకు పనిచేసే అవకాశం లేకుండా పోతుందని ఆ లేఖలో వివరించారు. అదే విధంగా తన స్థాయి అధికారికి వారానికి 40 గంటలు పని సమయం ఉండాలని తెలిపారు. సీఎస్‌కు అశోక్ ఖేమ్కా రాసిన లేఖ కారణంగానే ఆయనను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఖేమ్కాను రాష్ట్ర ఆర్కైవ్స్ విభాగంలో నియమించడం ఇది నాలుగోసారి. గతంలో ఆర్కైవ్స్ శాఖ డైరెక్టర్ జనరల్‌గా, ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. 2013లో హర్యానాలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఖేమ్కాను తొలిసారిగా ఈ శాఖకు బదిలీ చేశారు. అతను చివరిసారిగా అక్టోబర్ 2021లో ఆర్కైవ్స్ నుండి బదిలీ అయ్యాడు. ఖేమ్కా ఫిబ్రవరి 2022లో అదనపు ప్రధాన కార్యదర్శి స్థాయికి పదోన్నతి పొందారు.