లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న హరియాణా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్ పదవికి రాజీనామా చేశారు. తనపై కక్ష గట్టి ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వీటిపై దర్యాప్తు జరిగి నిజానిజాలు తేల్చాలన్నారు. అందుకోసమే బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు సందీప్ సింగ్ వివరించారు.
సందీప్ సింగ్ పై హరియాణాకు చెందిన జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ లైంగికల ఆరోపణలు చేశారు. గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. తనకు అనుకూలంగా వ్యవహరిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తానంటూ మంత్రి లైంగిక వేధించారని ఆవేదన వ్యక్తం చేసింది.తన మాటలు వినకపోవడంతో వేరే చోటుకి బదిలీ చేశారని ఆరోపించారు. దీనిపై డీజీపీ, సీఎం, రాష్ట్ర హోంమంత్రి శాఖ కార్యాలయాలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. తననే కాకుండా చాలా మంద్రి క్రీడాకారిణులను వేధించారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో హరియాణా ప్రభుత్వంలో కుదుపు మొదలైంది. ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.పోలీసులు కూడా మంత్రిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఇక అన్ని వైపులా నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చివరికి మంత్రి పదవికి సందీప్ సింగ్ రాజీనామా చేశారు.