ఐ ఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఐఫోన్ కొనేందుకు కిడ్నీలు తాకట్టు పెట్టారు, ఆస్తులు అమ్ముకున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఐ ఫోన్‌పై క్రేజ్ ఓ హత్యకు కారణమైంది. ఫోన్ కోసం డబ్బులు లేకపోవడంతో ఓ డెలివరీ బాయ్‌ని చంపేశాడు నిందితుడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.

హసన్ జిల్లాకు చెందిన హేమంత్ దత్త అనే యువకుడికి ఐ ఫోన్ అంటే పిచ్చి. కానీ అతని దగ్గరు కొనేందుకు డబ్బులు లేకపోవడంతో రూ.46 వేలకు ఓ సెకెండ్ ఐఫోన్ ఆన్ లైన్‌లో బుక్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 7వ తేదిన ఈ కార్ట్ ఎక్స్ ప్రెస్ కు చెందిన డెలివరీ బాయ్ ఫోన్ ఇచ్చేందుకు హేమంత్ నివాసానికి వచ్చాడు. డబ్బులు ఇచ్చి ఫోన్ తీసుకోవాలని డెలివరి బాయ్..హేమంత్‌కు సూచించాడు. తన దగ్గరు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో డెలివరీ బాయ్‌ని హత్య చేశాడు. కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి చంపేశాడు. అనంతరం శవాన్ని నాలుగు రోజుల పాటు ఇంట్లోనే దాచి ఉంచాడు. మృతదేహం వాసన రావడంతో గోనె సంచిలో బైక్ పై తీసుకెళ్లి రైల్వేట్రాక్ సమీపంలో కాల్చివేశాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి పోలీసులు అసలు విషయాన్ని తేల్చారు. హేమంత్ హత్య చేసినట్టు నిర్ధారించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.